July 10, 2026

సుప్రీంకోర్టులో హైడ్రామా:  జడ్జీలపై పేపర్లు విసిరేసి.. సీజేఐపై దురుసుగా ప్రవర్తించిన  పిటిషనర్

సుప్రీంకోర్టులో హైడ్రామా:  జడ్జీలపై పేపర్లు విసిరేసి.. సీజేఐపై దురుసుగా ప్రవర్తించిన  పిటిషనర్
Reading Time: 2 minutes

సుప్రీంకోర్టులో హైడ్రామా:  జడ్జీలపై పేపర్లు విసిరేసి.. సీజేఐపై దురుసుగా ప్రవర్తించిన  పిటిషనర్

Caption of Image.

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో జులై 10న  తీవ్ర కలకలం రేగింది. ఒక కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ కోర్టు రూమ్‌లోనే తీవ్ర హంగామా సృష్టించాడు. జడ్జిలపైకి పేపర్లు విసిరేసి దురుసుగా ప్రవర్తించాడు. దీంతో పిటిషనర్ ను సెక్యూరిటీ బయటకు ఈడ్చుకెళ్లారు. 

 అసలేం  జరిగిందంటే.. జస్టిస్ కె.వి. విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన బెంచ్ ముందు ప్రబల్ ప్రతాప్ అనే వ్యక్తి దాఖలు చేసిన అప్పీల్ విచారణకు వచ్చింది. ఈ క్రమంలో పిటిషనర్ నేరుగా న్యాయమూర్తులను ఉద్దేశించి.. మిస్టర్ జ్యుడీషియల్ సర్వెంట్.. లక్నో ఏసీపీ వికాస్ నగర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను అంటూ వింత వాదనకు దిగాడు. ఈ మాటలకు షాకైన జస్టిస్ విశ్వనాథన్.. నువ్వు మమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నావా? అని ప్రశ్నించారు.

ఆ వెంటనే  పిటిషనర్ ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ.. చేతిలోని కేసు పేపర్లను కోర్టు రూమ్‌లో విసిరికొట్టాడు. అంతేకాదు, భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్‌పై తీవ్ర పదజాలంతో బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. దీంతో అలర్ట్ అయిన సుప్రీంకోర్టు సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకుని, కోర్టు రూమ్ వెలుపలికి ఈడ్చుకెళ్లారు.

ఈ గందరగోళం మధ్య కూడా జడ్జీలు ఎంతో సంయమనం పాటించారు. పిటిషనర్ మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకుని, అతనిపై ఎలాంటి కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోకూడదని నిర్ణయించారు. అయితే ఆ కేసులో ఎలాంటి పస లేకపోవడంతో పిటిషన్‌ను మాత్రం కొట్టేశారు.

 మరో వైపు సుప్రీంకోర్టు ఆర్గ్యూయింగ్ కౌన్సెల్ అసోసియేషన్ సీజేఐకు లేఖ రాస్తూ సుప్రీంకోర్టులో జరిగిన ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టులో జరిగిన ఘటనను అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.కోర్టు గౌరవం, మర్యాద, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదని పేర్కొంది.

ఈ ఘటనలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రమేయం ఉన్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తిని కోరింది.గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగినప్పుడు సంబంధిత వ్యక్తులను క్షమించారని, అయితే ఆ చర్యను కొందరు దుర్వినియోగం చేసి ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగడానికి ప్రోత్సాహం లభించిందని పేర్కొంది.

ALSO READ : అవినీతి అధికారి మాస్టర్ ప్లాన్ : ఆ ఇంట్లోని గోడల్లో డబ్బు.. సోఫాల్లో డబ్బు.. 

ఇది కేవలం న్యాయమూర్తులపై దాడి మాత్రమే కాదు, మొత్తం న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించింది.కొన్ని సంఘటిత వర్గాలు న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించింది.కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్, స్వయంఘోషిత జర్నలిస్టులు కోర్టు విచారణల వీడియో క్లిప్‌లను సందర్భం లేకుండా ప్రచారం చేసి న్యాయమూర్తులపై అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపింది.

ఇలాంటి చర్యలు కోర్టుల అధికారాన్ని తగ్గించడమే కాకుండా ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని పేర్కొంది.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయవ్యవస్థ గౌరవం, స్వతంత్రత, అధికారాన్ని కాపాడాలని ప్రధాన న్యాయమూర్తిని విజ్ఞప్తి చేసింది.

©️ VIL Media Pvt Ltd.