July 8, 2026

T20I Records : తొలి 50 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ ఇండియన్లు వీరే.. యువరాజ్‎ను సమం చేసిన ఈషాన్

T20I Records  : తొలి 50 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ ఇండియన్లు వీరే.. యువరాజ్‎ను సమం చేసిన ఈషాన్
Reading Time: 2 minutes
T20I Records  : తొలి 50 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ ఇండియన్లు వీరే.. యువరాజ్‎ను సమం చేసిన ఈషాన్

T20I Records : టీ20 ప్రపంచకప్ గెలిచిన ఆనందం ముగియక ముందే భారత టీ20 క్రికెట్ జట్టు వరుస ఓటములతో తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా చారిత్రాత్మక పరాజయాన్ని మూటగట్టుకుంది. నాటింగ్ హామ్ వేదికగా జరిగిన ఈ పోరులో భారత జట్టు ఘోరంగా విఫలమైంది. అయితే, ఈ మ్యాచ్ ద్వారా భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ ఈషాన్ కిషన్ ఇద్దరూ ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్‌లో ఒకేసారి తమ 50వ ఇన్నింగ్స్ మైలురాయిని పూర్తి చేసుకున్నారు. ఒకేసారి 50 ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ, మైదానంలో సిక్సర్లు బాదడంలో మాత్రం ఈ ఇద్దరు యువ ఆటగాళ్ల మధ్య ఒక నమ్మలేని భారీ వ్యత్యాసం వెలుగుచూసింది.

అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో మొదటి 50 ఇన్నింగ్స్‌లు ఆడిన తర్వాత అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయ బ్యాటర్ల జాబితాను పరిశీలిస్తే అభిషేక్ శర్మ అందరికంటే టాప్‌లో నిలిచాడు. 25 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ ఇప్పటివరకు తన ఖాతాలో ఏకంగా 104 సిక్సర్లను కొట్టి, టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ (104 సిక్సర్లు) రికార్డును సమం చేశాడు. మరోవైపు, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ప్రపంచ నంబర్-1 బ్యాటర్‌గా ఉన్న 27 ఏళ్ల ఈషాన్ కిషన్ కేవలం 71 సిక్సర్లు మాత్రమే కొట్టగలిగాడు. వీరిద్దరి మధ్య ఏకంగా 33 సిక్సర్ల భారీ తేడా ఉండటం గమనార్హం. జులై 2024లో అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ చాలా వేగంగా ఈ మైలురాయిని అందుకోగా, మార్చి 2021లో ఎంట్రీ ఇచ్చిన ఈషాన్ కిషన్ మధ్యలో రెండేళ్లు జట్టుకు దూరమై, జనవరి 2026లో రీఎంట్రీ ఇచ్చి 50 ఇన్నింగ్స్‌లు పూర్తి చేశాడు.

భారత్ తరఫున తొలి 50 టీ20 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ బ్యాటర్లు:

అభిషేక్ శర్మ – 104 సిక్సర్లు

సూర్యకుమార్ యాదవ్ – 104 సిక్సర్లు

తిలక్ వర్మ – 75 సిక్సర్లు

ఈషాన్ కిషన్ – 71 సిక్సర్లు

యువరాజ్ సింగ్ – 71 సిక్సర్లు

నాటింగ్ హామ్ టీ20లో టీమిండియా ఘోర పరాజయం

నాటింగ్ హామ్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ విధించిన 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటింగ్ లైన్అప్ కేవలం 11.4 ఓవర్లలోనే 76 పరుగులకు కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 7 బంతుల్లో ఒక సిక్సర్‌తో 10 పరుగులు చేయగా, ఈషాన్ కిషన్ 9 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 13 పరుగులు మాత్రమే చేశారు. ఐపీఎల్ స్టార్లుగా వెలుగొందిన భారత బ్యాటర్లు ఇంగ్లండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ వేగానికి బెంబేలెత్తిపోయారు. ఆర్చర్ 3 ఓవర్లలో 29 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీయగా, జోష్ టంగ్ 4 ఓవర్లలో 28 రన్స్ ఇచ్చి 4 వికెట్లతో భారత్ నడ్డి విరిచారు.

వరుస ఓటములతో ఒత్తిడిలో గౌతమ్ గంభీర్

భారత జట్టు కేవలం 52 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. జట్టులో కేవలం నలుగురు బ్యాటర్లు మాత్రమే రెండెంకెల స్కోరు దాటగలిగారు. బాధ్యతారాహిత్యమైన షాట్లతో వికెట్లు పారేసుకోవడం వల్లే పరుగుల పరంగా భారత్ తన టీ20 చరిత్రలోనే అత్యంత భారీ ఓటమిని (125 పరుగుల తేడాతో) చవిచూడాల్సి వచ్చింది. గత ఐదు టీ20 మ్యాచ్‌లలో భారత్ నాలుగింటిలో ఓడిపోగా, ఒకటి వర్షం వల్ల రద్దయింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా జట్టు ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్ర నిర్ణయాలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-0తో ముందంజలో ఉండగా, సిరీస్ విజేతను నిర్ణయించే నాల్గో టీ20 మ్యాచ్ గురువారం బ్రిస్టల్‌లో జరగనుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..