Roshan Kanakala: ప్రేమ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్.. రోషన్ కనకాల కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!

Roshan Kanakala: తెలుగు చిత్రసీమలో కొత్త తరహా కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్న యువ నటుడు రోషన్ కనకాల. ఇప్పుడు ప్రేమ, మిస్టరీ, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న కొత్త చిత్రంతో మందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం నిన్న ఘనంగా ప్రారంభమైంది. టైటిల్‌ను ఇప్పటికీ రహస్యంగా ఉంచినప్పటికీ, చిత్రబృందం వెల్లడించిన వివరాలు చూస్తుంటే ఇది కొత్త తరహా కంటెంట్ అందించే ప్రయత్నంగా కనిపిస్తోంది. ప్రేక్షకులను ఆకట్టుకునే కాన్సెప్ట్‌తో పాటు విజువల్ పరంగా కూడా ఈ చిత్రం ప్రత్యేకంగా ఉండబోతుందనే సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఓపెనింగ్ కార్యక్రమం సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు వి.ఐ. ఆనంద్ ముహూర్తంతో చిత్రాన్ని ప్రారంభించగా, ప్రత్యేక అతిథులుగా హీరో నిఖిల్, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంతో సినిమా అధికారికంగా పట్టాలెక్కింది. ఈ చిత్రానికి కథను వి. ఆనంద్ అందించారు. ఆ కథ ఆధారంగా ఒరిజినల్ స్క్రీన్‌ప్లేను రూపొందించిన విజయ్ కె. కామిశెట్టి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌కు క్రియేటివ్ ప్రొడ్యూసర్ బాధ్యతలను కూడా ఆయనే నిర్వహించడం విశేషం. కథను మిస్టరీ, కామెడీ, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ అంశాలతో తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. దీంతో కథ ఎలా ఉండబోతోందనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగింది.
ఈ సినిమాలో రోషన్ కనకాల సరసన గహాజీ కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం టైటిల్‌ను రహస్యంగా ఉంచిన నిర్మాతలు, త్వరలోనే ఫస్ట్ లుక్‌తో పాటు ఇతర వివరాలను కూడా వెల్లడించనున్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో తెలుగు చిత్రసీమలో సైన్స్ ఫిక్షన్ కథలకు మంచి ఆదరణ లభిస్తోంది. అయితే ఆ జానర్‌ను ప్రేమ, ఫాంటసీ, మిస్టరీ అంశాలతో మేళవించి రూపొందించే ప్రయత్నాలు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. అలాంటి సమయంలో రోషన్ కనకాల వంటి యువ నటుడు ఈ తరహా కథను ఎంచుకోవడం అతని కెరీర్‌లో మరో కీలక అడుగుగా సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. టైటిల్‌తో పాటు మరిన్ని అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఈ ప్రాజెక్ట్ రోషన్ కనకాల కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందా అనే ప్రశ్నకు సమాధానం రావాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.