అత్తాపూర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు..ఎక్స్ పైరీ చాక్లెట్లు, బిస్కెట్లు సీజ్

హైదరాబాద్ : నగరంలోని అత్తాపూర్ లో తినుబండారాల డిస్ట్రిబ్యూటర్ వేర్ హౌజ్ లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. నిబంధనలు పాటించకుండా వివిధ రకాల ఆహార పదార్థాలను నిల్వ ఉంచిన గుర్తించారు. పెద్ద ఎత్తున కాలం చెల్లిన (ఎక్స్ పైరీ డేట్ ) తినుబండారాలను సీజ్ చేశారు. వేర్‌హౌజ్ లో దొరికిన పలు రకాల తినుబండారాల శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపించారు.నిబంధనలు ఉల్లంఘించినందుకు డిస్ట్రిబ్యూటర్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్ పరిధిలోని అత్తాపూర్‌లో బుధవారం (జూలై 8)ఫుడ్ సేఫ్టీ అధికారులు, హెచ్ ఫాస్ట్ (H-FAST) సిబ్బంది సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రముఖ తినుబండారాల డిస్ట్రిబ్యూటర్ వేర్‌హౌస్‌పై ఈ దాడులు చేశారు. రాజేంద్రనగర్ ఫుడ్ సేఫ్టీ అధికారిణి సౌమ్య నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. సదరు డిస్ట్రిబ్యూటర్ ఎటువంటి ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా, భారీ ఎత్తున వివిధ రకాల ఆహార పదార్థాలను నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఎక్స్‌పైరీ డేట్ (కాలం ముగిసిన) అయిపోయిన తినుబండారాలను సైతం వేర్‌హౌస్‌లో భద్రపరచడంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సదరు నిర్వాహకులు ఇక్కడి నుంచే హైదరాబాద్ నగరంలోని వందలాది కిరాణా షాపులకు నిత్యావసరాలు, తినుబండారాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఇప్పటికే కాలం చెల్లిన పలు రకాల ఆహార పదార్థాలను మార్కెట్లోకి సరఫరా చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఆహార భద్రత విషయంలో రాజీ పడేదే లేదని, నిబంధనలు ఉల్లంఘించే డిస్ట్రిబ్యూటర్లు, వ్యాపారులపై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.