July 8, 2026

Indian Railways: రైలులోనే “శోభనం గది”.. డెకరేషన్ మామూలుగా లేదు గురూ.. ఇక్కడే అసలైన ట్విస్ట్.!

Indian Railways: రైలులోనే “శోభనం గది”.. డెకరేషన్ మామూలుగా లేదు గురూ.. ఇక్కడే అసలైన ట్విస్ట్.!
Reading Time: 2 minutes
Indian Railways First Ac Coach Honeymoon Suite Viral Video Cti Suspended

Indian Railways: భారతీయ రైల్వేకి చెందిన ఫస్ట్ ఏసీ కోచ్‌ను రోమాంటిక్ ‘హనీమూన్ సూట్’గా మార్చిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మరోవైపు.. ఈ అంశంపై పెద్ద వివాదం, చర్చకు దారితీసింది. వాస్తవానికి.. నాందేడ్‌గ్రామ్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 110002) రైలులో ఓ కంపార్ట్‌మెంట్‌ను బెలూన్లు, రంగు రంగుల పూలు, వేలాది గులాబీ రేకులతో పాటు “ఐ లవ్ యూ” అనే మెసేజ్‌తో అత్యంత విలాసవంతంగా అలంకరించారు. ఈ రోమాంటిక్ సెటప్ వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు బయటపడింది. మహారాష్ట్రకు చెందిన ‘రాహత్ రూమ్ డెకరేషన్’ అనే ప్రైవేట్ సంస్థ ఈ అలంకరణ చేసినట్లు అంగీకరించింది. జల్నాకు చెందిన ఓ కొత్త జంట కోసం ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. ఆ జంట ఔరంగాబాద్ నుంచి జల్నా రైల్వే స్టేషన్‌కు చేరుకునే లోపే ఈ డెకరేషన్ చేశారు. ఆ తర్వాత జల్నా స్టేషన్‌లో ఆ దంపతులు రైలు ఎక్కారు.

అయితే, ఈ అందమైన సర్ప్‌రైజ్ వెనుక ఉన్న అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది. ఈ వ్యవహారంపై భారతీయ రైల్వే శాఖ తీవ్రంగా స్పందించింది. డెకరేషన్ నిర్వాహకులు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా రైలు కోచ్‌లోకి ప్రవేశించారని, ఇది రైల్వే నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఈ భద్రతా లోపానికి బాధ్యుడిగా చేస్తూ, ఆ సమయంలో విధుల్లో ఉన్న చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ గిరీష్ కుమార్‌ను రైల్వే శాఖ తక్షణమే సస్పెండ్ చేసింది. అంతేకాకుండా, ఈ నిర్లక్ష్యానికి కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా అంతర్గత శాఖాపరమైన విచారణకు సైతం ఆదేశించింది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతమైన మీమ్స్, జోకులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. నెటిజన్లు ఈ కోచ్‌కు సుహాగ్‌రాత్ ఎక్స్‌ప్రెస్ అని, హనీమూన్ ఆన్ వీల్స్ అని రకరకాల పేర్లు పెడుతున్నారు. కదిలే రైలులో ఇలాంటి ప్రయోగాలు ఎంతవరకు ప్రాక్టికల్ అంటూ నవ్వుకుంటున్నారు. ఒకవైపు కొందరు తమ ప్రత్యేక క్షణాలను ఇంత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుందని ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం రైల్వే నిబంధనలను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తి అయిన రైలు కోచ్‌లను ఇలా ప్రైవేట్ వ్యక్తులు తమ ఇష్టమొచ్చినట్లు అలంకరించడానికి అనుమతులు ఎలా ఇస్తారని నిలదీస్తున్నారు. ముఖ్యంగా బెలూన్లు, కాగితాలు, పూలు వంటి వస్తువుల వల్ల అగ్నిప్రమాదాలు జరిగే ముప్పు ఉంటుందని, ఇది తోటి ప్రయాణికుల భద్రతకు, రైలు పరిశుభ్రతకు విఘాతం కలిగిస్తుందని ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.