IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇప్పటికే 3-0తో ఆధిక్యంలో ఉన్న ఆతిథ్య జట్టు ఇంగ్లండ్.. ఇప్పుడు భారత్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది. శనివారం (జులై 11) సౌతాంప్టన్‌లో జరగనున్న చివరి టీ20కు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. గత కొన్నేళ్లుగా భారత జట్టు ఎంత బాగా ఆడిందో అందరికి తెలుసని, అయితే ఈ సిరీస్‌లో మాత్రం ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేదని అభిప్రాయపడ్డాడు. సిరీస్‌లో పెద్దగా మజా లేదని చెప్పాడు. ప్రపంచ నంబర్-1 టీ20 జట్టుగా ఎదగడమే తమ లక్ష్యమని బ్రూక్ స్పష్టం చేశాడు.
భారత్ స్థాయి ప్రదర్శన కాదు ఇది:
‘భారత్ ఎప్పుడూ బలమైన జట్టే. గత రెండు మూడు సంవత్సరాల్లో టీమిండియా అద్భుతమైన క్రికెట్ ఆడింది. కానీ ఈ సిరీస్‌లో మాత్రం ఇండియా తమ స్థాయి ప్రదర్శన చేయలేదు. సిరీస్‌లో కాస్త పోటీతత్వం తగ్గింది. మేము మా ప్రణాళికలను అద్భుతంగా అమలు చేశాం. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడి విజయాలు సాధించాం’ అని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తెలిపాడు. నాలుగో టీ20లో బ్రూక్ అజేయంగా 79 పరుగులు చేసి ఇంగ్లండ్‌ను 9 వికెట్ల తేడాతో గెలిపించిన విషయం తెలిసిందే.
ప్రపంచ నంబర్-1 లక్ష్యం:
చివరి టీ20లో విజయం సాధిస్తే ఇంగ్లండ్ ప్రపంచ నంబర్-1 టీ20 జట్టుగా అవతరిస్తుందని బ్రూక్ వెల్లడించాడు. ‘మరో మ్యాచ్ గెలిస్తే మేము ప్రపంచ నంబర్-1 అవుతామని మాకు చెప్పారు. అది మాకు ఎంతో పెద్ద ప్రేరణ. భారత్ లాంటి బలమైన జట్టును 4-0తో ఓడించడం చాలా ప్రత్యేకమైన విజయం అవుతుంది. ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుకోవడం కంటే గొప్ప విషయం. టీమిండియాను ఓడించి నంబర్-1 అవుతాం’ అని పేర్కొన్నాడు.
ఏకపక్ష సిరీస్ ఊహించలేదు:
ఈ సిరీస్ ఇంత ఏకపక్షంగా సాగుతుందని తాను ఊహించలేదని బ్రూక్ చెప్పాడు. అయితే ఇంగ్లండ్ ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చూపిస్తున్న ప్రగతి ఫలితమే ఈ విజయాల వెనుక కారణమని వివరించాడు. ‘మా వైట్‌బాల్ జట్టు సరైన దారిలో ప్రయాణిస్తోంది. మేము అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నాం. పిచ్, పరిస్థితులకు త్వరగా అలవాటు పడుతున్నాం. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో కూడా మంచి ప్రదర్శన చేశాం. ఈ సిరీస్ విజయం ఇంగ్లండ్ క్రికెట్‌పై ఉన్న అభిప్రాయాన్ని మరింత మార్చుతుందని భావిస్తున్నాను’ అని అన్నాడు.