22 ఏళ్ల తర్వాత నటుడిగా థమన్.. లవ్ ఎమోషన్స్‌తో గుండెల్ని పిండేస్తున్న ‘హృదయం మురళి’ ట్రైలర్!

కోలీవుడ్ యంగ్ హీరో అథర్వ మురళి , దర్శకుడు ఆకాష్ భాస్కరన్ కాంబినేషన్ లో వస్తున్న యూత్‌ఫుల్ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాగా ‘హృదయం మురళి’ (Idhayam Murali). లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఇది కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా, జీవితంలో మరచిపోలేని జ్ఞాపకాలు, నెరవేరని ప్రేమ, మనసులో మిగిలిపోయే భావోద్వేగాల ప్రయాణంగా తెరకెక్కినట్టు స్పష్టమవుతోంది.
ఒక యువకుడి జీవితంలో ఎదురయ్యే వన్-సైడెడ్ లవ్, అతని భావోద్వేగ సంఘర్షణలు, కాలం గడిచినా చెరగని జ్ఞాపకాల చుట్టూ కథ తిరుగుతుందని ట్రైలర్ హింట్ ఇస్తోంది. ప్రతి ఫ్రేమ్ విజువల్‌గా ఆకట్టుకుంటుండగా, డైలాగ్స్ హృదయాన్ని తాకేలా ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమలో ఓడిపోయిన ప్రతి ఒక్కరూ తమను తాము ఈ కథలో చూసుకునేలా దర్శకుడు కథను మలిచినట్లు కనిపిస్తోంది. ప్రతి ఒక్కరి ఫస్ట్ లవ్ మెమొరీస్‌ని తట్టి లేపేలా ఉంది.
ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, కాయదు లోహర్ కథానాయికలుగా, మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ దాదాపు 22 ఏళ్ల తర్వాత మళ్లీ నటుడిగా తెరపై కనిపించనుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అంతేకాదు, ఆయన అందించిన సంగీతం ట్రైలర్‌కు ప్రాణం పోసింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి ఎమోషన్‌ను మరింత బలంగా ఎలివేట్ చేస్తోంది.
డాన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్ పవర్‌ఫుల్ క్యామియోలో కనిపించనున్నారని సమాచారం. ఆయన పాత్ర కథలో కీలక మలుపు తీసుకొస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తుండగా, జూలై 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ట్రైలర్‌కు యూత్ నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ప్రేమ, భావోద్వేగాలు, సంగీతం, విజువల్స్ కలయికగా వస్తున్న ‘హృదయం మురళి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.