బెంగళూరులో టీచర్ జీతం రూ.6 వేలా? ఎలా సరిపోతాయంటూ నెటిజన్లు ఫైర్

ఒక వైపు స్కూల్ ఫీజులు ఆకాశాన్ని తాకుతున్నాయి.. మరోవైపు పిల్లలకు చదువులు చెప్పే టీచర్ల జీతాలు మాత్రం నేలచూపులు చూస్తున్నాయి. బెంగళూరులో ఓ కిండర్‌గార్టెన్ టీచర్‌కు నెలకు కేవలం రూ.6వేలు జీతం ఆఫర్ చేయడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. మెట్రో నగరంలో ఇంత తక్కువ జీతంతో ఎలా బతకాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన ప్రైవేట్ స్కూళ్లలో టీచర్ల వేతనాలపై మరోసారి చర్చను తెరపైకి తీసుకొచ్చింది. లక్షల్లో ఫీజులు గుంజే విద్యా సంస్థలు మరీ ఇంత దారుణంగా వ్యవహరించటంపై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.
ఎక్స్ లో ఓ వ్యక్తి చేసిన పోస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తన మరదలికి బెంగళూరులోని ఓ ప్లేస్కూల్ అదేనండి కిండర్‌గార్టెన్‌లో టీచర్ ఉద్యోగం వచ్చిందని, అయితే నెలకు కేవలం రూ.6వేలు మాత్రమే జీతం ఇస్తున్నారని పేర్కొన్నారు. “స్కూల్ ఫీజులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.. కానీ టీచర్ల జీతాలు మాత్రం తగ్గిపోతున్నాయి. మెట్రో నగరంలో రూ.6వేలతో ఎలా జీవించగలరు?” అంటూ ప్రశ్నించారు.
My sister-in-law just got a job as a playschool/kindergarten teacher and she’ll be paid a whopping ₹6,000 per month in Bangalore!
While school fees are skyrocketing, teacher salaries are plummeting.
How on earth can anyone live on under ₹6,000 a month in a metro city?
— Mohamed Nowsath (@Md_Nowsath_) July 5, 2026
ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. తమ ఇంట్లో సగం రోజు పని చేసే పనిమనిషికి కూడా దీన్నికంటే ఎక్కువ జీతం ఇస్తున్నాం అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. మరో వ్యక్తి, “భారత్‌లో నర్సులు కూడా రూ.10 వేల నుంచి రూ.15 వేల మధ్యే సంపాదిస్తున్నారు. అందుకే చాలామంది విదేశాలకు వెళ్తున్నారు” అంటూ స్పందించాడు. “కొన్ని కంపెనీలు డెలివరీ ఉద్యోగులకే రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు జీతం ఇస్తున్నాయి. కానీ టీచర్‌కు రూ.6 వేలే ఇవ్వడం బాధాకరం. అలాంటి జాబ్ ఆఫర్స్ అసలు అంగీకరించకూడదు” అని మరో యూజర్ సూచించారు. అసలు ఈ రూ.6 వేలతో అద్దె, కరెంట్ బిల్లు, పిల్లల చదువు, కూరగాయలు అన్నీ చూసుకుని, మిగిలిన డబ్బుతో బయట భోజనం కూడా చేయొచ్చని భావిస్తున్నారేమో అంటూ మరో యూజర్ సదరు స్కూల్ యాజమాన్యంపై సెటైరికల్ రిప్లై వేశాడు.
►ALSO READ | వేరువేరుగా ఫ్యూర్, E10, E20 పెట్రోల్స్ అమ్మటం కుదరదా..? తప్పక తెలుసుకోండి
ఈ సంఘటనతో మెట్రో నగరాల్లో పెరుగుతున్న జీవన వ్యయం, ప్రైవేట్ విద్యాసంస్థల్లో తక్కువ వేతనాలు, టీచర్లకు సరైన గౌరవం దక్కడం లేదనే అంశాలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. మంచి విద్య అందించే వారి జీవితం ఇంత కష్టంగా ఉంటే.. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.