తెలంగాణ యువతకు గుడ్ న్యూస్.. అలాంటి వాళ్లకు జర్మనీలో ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది : మంత్రి వివేక్

తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రాష్ట్రవ్యాప్తంగా ఏటీసీ (ATC) సెంటర్లను ప్రభుత్వం ఏకంగా 400 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించనుందని ఆయన వెల్లడించారు.
తెలంగాణలోని ఈ ATC సెంటర్లలో అత్యాధునిక రంగాలలో నాణ్యమైన శిక్షణ ఇచ్చి, యువతకు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. కేవలం టెక్నికల్ కోర్సులు మాత్రమే కాకుండా, ఈ సెంటర్ల ద్వారా ఫ్యాషన్ డిజైనింగ్‌లో కూడా శిక్షణ అందించాలని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అన్ని రంగాల ట్రేనింగ్ ఇక్కడ ఒకే చోట లభించబోతోంది.
ఇక విదేశాల్లో ఉద్యోగాల గురించి మాట్లాడుతూ మంత్రి వివేక్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం జర్మన’ లాంగ్వేజ్ నేర్చుకుంటే అంతర్జాతీయంగా ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు.టామ్‌కామ్ (Tomcom) సంస్థ ద్వారా ఎవరైనా 50 మందితో కూడి గ్రూప్‌గా ఏర్పడితే.. వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి, జర్మనీ పంపించే పూర్తి బాధ్యత తనదని హామీ ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 119 ATC సెంటర్ల వైపు ఈరోజు దేశం మొత్తం అభినందిస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి ధీమా వ్యక్తం చేశారు. మన యువత గ్లోబల్ లెవెల్లో రాణించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం.