July 9, 2026

Abhishek Sharma: “గర్ల్‌ఫ్రెండ్” అంటూ ప్రచారం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అభిషేక్ శర్మ.. కట్‌చేస్తే..

Abhishek Sharma: “గర్ల్‌ఫ్రెండ్” అంటూ ప్రచారం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అభిషేక్ శర్మ.. కట్‌చేస్తే..
Reading Time: < 1 minute
Delhi High Court Abhishek Sharma Personality Rights Ai Content Order

Abhishek Sharma: భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ తన ‘పర్సనాలిటీ రైట్స్’ (వ్యక్తిత్వ హక్కులు) రక్షణ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అతని పేరు, ముఖచిత్రం (likeness), గుర్తింపును దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వివాదాస్పద లింకులను (URLs) తక్షణమే తొలగించాలని ఇంటర్మీడియరీలను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ కేసులోని నిందితులకు (defendants) కోర్టు సమన్లు జారీ చేసింది. జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఈ కేసును విచారించింది. నిందితుల సామాజిక మాధ్యమాల (social media handles) ద్వారా, అందుబాటులో ఉన్న చిరునామాలు, చట్టబద్ధమైన అన్ని మార్గాల ద్వారా ఈ సమన్లు, నోటీసులను అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది.

ముఖ్యంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో డిజిటల్‌గా మార్చిన అసభ్యకరమైన కంటెంట్‌ను తొలగించాలని అభిషేక్ శర్మ కోర్టును ఆశ్రయించారు. ఒక నిర్దిష్ట ఏఐ పోస్ట్‌లో క్రికెటర్ ఫొటోను అతని మేనేజర్‌తో కలిపి తప్పుడు వ్యాఖ్యలతో గర్ల్‌ఫ్రెండ్ అంటూ తప్పుగా చిత్రీకరించారని అతని తరఫు న్యాయవాది గౌరవ్ బాల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం అభిషేక్ గుర్తింపును వాడుకుంటున్నారని తెలిపారు. కాగా, ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ (Meta) తరఫున హాజరైన అడ్వకేట్ వరుణ్ పాఠక్ స్పందిస్తూ.. ప్రస్తుతం తమ ప్లాట్‌ఫారమ్‌లలో కేవలం రెండు అభ్యంతరకర లింకులు (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకటి చొప్పున) మాత్రమే అందుబాటులో ఉన్నాయని, వాటిని కూడా త్వరలోనే పూర్తిగా తొలగిస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. అలాగే అభ్యంతరకర లింకులను తొలగించేందుకు అమెజాన్ ప్రతినిధులు సైత అంగీకరించారు.