July 9, 2026

తుంగతుర్తి కాంగ్రెస్ లో వర్గపోరు..పార్టీ మండల అధ్యక్షుల నియామకంతో బయటపడ్డ విబేధాలు

తుంగతుర్తి కాంగ్రెస్ లో వర్గపోరు..పార్టీ మండల అధ్యక్షుల నియామకంతో బయటపడ్డ విబేధాలు
Reading Time: 2 minutes

తుంగతుర్తి కాంగ్రెస్ లో వర్గపోరు..పార్టీ మండల అధ్యక్షుల నియామకంతో బయటపడ్డ విబేధాలు

Caption of Image.
  • ఎమ్మెల్యే సామేల్ అనుచరులకే పదవులు ఇస్తున్నారని సీనియర్ల మండిపాటు
  • ఫిర్యాదు చేసేందుకు గాంధీ భవన్ కు వెళ్తుండగా…
  •  అర్వపల్లిలో అడ్డుకున్న ఎమ్మెల్యే వర్గం
  • ఇరువర్గాల రాళ్ల దాడి, పోలీసుల లాఠీచార్జి

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి కాంగ్రెస్ లో వర్గపోరు బహిర్గతం అయింది. పార్టీ మండల అధ్యక్షుల నియామకంతో బయటపడ్డ విబేధాలు రాళ్లదాడుల వరకూ వెళ్లాయి. అర్వపల్లి వద్ద ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. వివరాల్లోకి వెళ్తే… తుంగతుర్తి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు కాంగ్రెస్ అధ్యక్షులను ఎమ్మెల్యే సామేల్ ప్రకటించారు.

 అయితే  మోత్కూరు, అడ్డగూడూరు, తిరుమలగిరి, అర్వపల్లి మండలాల్లో ఏండ్ల తరబడి పార్టీని నమ్ముకున్న వారిని కాదని బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారని నాయకులు ఆరోపిస్తున్నారు. మండల కమిటీలతో పాటు నామినేటెడ్ పదవుల విషయంలో సామేల్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కార్యకర్తలు మొదటి నుంచి అసంతృప్తితో ఉన్నారు. 

ఎమ్మెల్యే తీరుకు నిరసనగా రెండు రోజుల కింద సూర్యాపేట-, జనగామ రహదారిపై రాస్తారోకో చేశారు. డీసీసీ అధ్యక్షుడిని, సీనియర్​నేతలను సంప్రదించకుండానే మండల పార్టీ అధ్యక్షులను ఏకపక్షంగా ఎంపిక చేశారంటూ భువనగిరి ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డికి ఫిర్యాదు చేశారు. 

దీంతో ఎమ్మెల్యే తీరుపై ఎంపీ సీరియస్ అయ్యారు. ఈ నియామకాలను రద్దు చేయాలని కోరుతూ ఏఐసీసీ ఇన్​చార్జి మీనాక్షీ నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు లెటర్ రాశారు. ఈ క్రమంలోనే బుధవారం పలువురు నాయకులు గాంధీ భవన్‌కు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సామేల్ అనుచరులు అర్వపల్లి వద్ద వారిని అడ్డుకున్నారు.

 ఈ క్రమంలో రెండువర్గాల మధ్య వాగ్వాదం జరిగి, ఒకరిపై ఒకరు రాళ్లతో దాడులు చేసుకున్నారు. దాడుల్లో పలువురికి గాయాలు కాగా, కార్లు ధ్వంసం అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని లాఠీ చార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.

గాంధీ భవన్ ముందు కాంగ్రెస్ నేతల నిరసన

హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్యే సామేల్ నుంచి తుంగతుర్తి కాంగ్రెస్ ను కాపాడాలంటూ ఆ నియోజకవర్గ నాయకులు బుధవారం గాంధీ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి పదవులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే సిఫార్సు చేసిన అన్ని పార్టీ, నామినేటెడ్ పదవులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

©️ VIL Media Pvt Ltd.