దేవుడి దగ్గర దోపిడీ ఏంట్రా : బద్రీనాథ్ ఆలయంలో VIP దర్శనం పేరుతో 11 వందలు అక్రమంగా వసూలు

బద్రీనాథ్ ధామ్‌లో విరాళాల వివాదం సద్దుమణగకముందే మరో వివాదం వెలుగులోకి వచ్చింది. విఐపీ దర్శనాల పేరుతో భక్తుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.
నిబంధనల ప్రకారం ఆలయంలో పూజలు, ఆచారాలు, ఇతర సేవలకు సంబంధించిన ధరలను నిర్ణయించే అధికారం పూర్తిగా బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) కి మాత్రమే ఉంది. అయితే కమిటీ ఛైర్మన్ ఆఫీసులో పీఏగా పనిచేస్తున్న ప్రమోద్ నౌటియాల్ అనే వ్యక్తి.. కమిటీ అనుమతి లేకుండానే భక్తులకు విఐపీ దర్శనం కల్పిస్తామని చెబుతూ ఒక్కొక్కరి నుంచి రూ.1,100 చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మే, జూన్ నెలల్లో యాత్రికుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ, ప్రత్యేక విఐపీ దర్శనాన్ని ఉచితంగానే కొనసాగించాలని ఆలయ కమిటీ ముందుగానే నిర్ణయించింది. అయినప్పటికీ జూన్ 29 నుంచి ఎలాంటి అధికారిక తీర్మానం లేకుండానే విఐపీ ప్రవేశానికి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ వ్యవహారంపై ఆలయ పూజారులుతీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికారులు శాఖాపరమైన విచారణ ప్రారంభించారు. కమిటీ బోర్డు సమావేశంలో విఐపీ దర్శన ధరలపై ఎలాంటి ప్రతిపాదన చర్చకు రాలేదని, పూజా ధర పెంపు అంశాన్ని మాత్రమే ఆమోదించినట్లు బీకేటీసీ ఉపాధ్యక్షుడు కిషోర్ పన్వార్ తెలిపారు.
బోర్డు తీర్మానం లేకుండా ఎలాంటి పరిపాలనా రుసుము విధించడం చట్ట విరుద్ధమని ఆలయ కమిటీ ఓ సీనియర్ అధికారి చెప్పారు. కొత్త ధర అవసరమని భావించినా, అత్యవసర సమావేశం నిర్వహించి కమిటీ ఆమోదం తీసుకోవాల్సి ఉండాల్సింది అన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ కొనసాగుతోంది.