Stock Market: ట్రంప్ దెబ్బ.. స్టాక్ మార్కెట్‌లో బ్లడ్‌బాత్

దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి ఘోరంగా పతనం అయింది. ఇటీవల కాలంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మార్కెట్ బుధవారం బ్లడ్‌బాత్ చూసింది. పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో మార్కెట్ ఒక్కసారిగా ఢమాల్ అయింది. ఇరాన్-అమెరికా పరస్పర దాడులు.. మరోవైపు ట్రంప్ హెచ్చరికలు మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బకొట్టింది. అంతర్జాతీయంగా కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో ఉదయం నుంచి తడబడుతూ ఉన్న మార్కెట్.. మధ్యాహ్నం నుంచి భారీగా పడిపోయింది. ప్రధాన షేర్లన్నీ భారీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు పెద్ద నష్టాన్ని చవిచూశారు.
ఇరాన్‌పై అమెరికా తాజా వైమానిక దాడులు, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావంతో భారీ నష్టాలతో స్టాక్ మార్కెట్ ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,677 పాయింట్లు నష్టపోయి 76, 503 దగ్గర ముగియగా.. నిఫ్టీ 516 పాయింట్లు నష్టపోయి 23, 882 దగ్గర ముగిసింది. నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన షేర్లలో జియో ఫైనాన్షియల్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, హిందుస్థాన్ యూనిలీవర్ న్నాయి. ఇక ఓఎన్‌జీసీ, హిందాల్కో ఇండస్ట్రీస్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో లాభాల్లో ముగిశాయి. ఈ పరిణామంతో పెట్టుబడిదారుల్లో భయాందోళనలు మళ్లీ మొదలయ్యాయి.
ఇక విదేశీ మారక మార్కెట్లో కూడా రూపాయిపై ఒత్తిడి కొనసాగింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి 58 పైసలు బలహీనపడింది. మంగళవారం ముగింపు స్థాయి 94.97 నుంచి బుధవారం డాలర్‌కు రూ.95.55 దగ్గర ముగిసింది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి అంశాలు రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.