Jana Nayagan: అఫీషియల్.. ఎట్టకేలకు సీఎం విజయ్ ‘జన నాయగన్’ సినిమా సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఇదే!

తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో దళపతి విజయ్ కోట్లాది మంది అభిమానుల ఏడు నెలల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. అనేక చట్టపరమైన, సాంకేతిక అడ్డంకులను అధిగమించిన తర్వాత విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ రిలీజ్ కు సెన్సార్ బోర్డు (CBFC) నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది . అయితే, ఈ చిత్రానికి వచ్చిన సర్టిఫికేట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ జన నాయగన్ చిత్రానికి ‘A’ (పెద్దలకు మాత్రమే) సర్టిఫికేట్ ఇచ్చింది. అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించిన ప్రకారం, ఈ సినిమా మొత్తం నిడివి 183 నిమిషాలు (3 గంటల 3 నిమిషాలు). ఈ చిత్రం తెలుగు సూపర్ హిట్ ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అని, ఒరిజినల్ చిత్రానికి ‘U/A’ సర్టిఫికేట్ లభించిందని చెబుతున్నారు. కానీ తమిళ వెర్షన్‌కు ‘A’ సర్టిఫికేట్ రావడం చూస్తే, దర్శకుడు హెచ్. వినోద్ కథ యాక్షన్ సన్నివేశాలలో పెద్ద మార్పులు చేశారని స్పష్టమవుతోంది.
కాగా జన నాయగన్ చిత్రాన్నిమొదట సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 9న విడుదల చేయాలనుకున్నారు. అందులో బాగంగానే 2025 డిసెంబర్‌లో సెన్సార్‌కు సమర్పించారు. మొదట్లో ఈ చిత్రానికి ‘U/A 16+’ రేటింగ్ లభించవచ్చని చెప్పినప్పటికీ, కమిటీలోని ఒక సభ్యుడు చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో, ఈ చిత్రం రివైజింగ్ కమిటీకి వెళ్లింది. ఆ తర్వాత, నిర్మాతలు కోర్టును ఆశ్రయించడంతో, సెన్సార్ ప్రక్రియ మరింత ఆలస్యమైంది. దీంతో విజయ్ సినిమా విడుదల వాయిదా పడింది. సినిమా విడుదల ఆలస్యం కావడం అభిమానులకు నిరాశ కలిగించినప్పటికీ, ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ‘తమిళగా వెట్రి కలగం’ పార్టీ ఘన విజయం సాధించడం, విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందే పూర్తయిన ఈ చిత్రం, విజయ్ మూడు దశాబ్దాల సినీ ప్రస్థానంలో చివరి అంకం.
జన నాయగన్ చిత్రాన్ని ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మించింది. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహించగా, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సెన్సార్ పూర్తయినందున, ఈ చిత్రం జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయ్ కు ఇదే మొదటి, చివరి చిత్రం కావడంతో అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది.
Jana Nayagan – censorship information #CBFCWatchWithParth pic.twitter.com/IE1z4T9iVI
— Parth Chaturvedi (@_mrchaturvedi) July 9, 2026