Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే భారీగా నష్టపోతారు..

తక్కువ వడ్డీ, వేగంగా డబ్బులు చేతికి అందే అవకాశం ఉండటంతో గోల్డ్ లోన్లకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు అవసరమైనప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టి తక్కువ వడ్డీతో రుణం పొందుతున్నారు. ఇక పిల్లల చదువులు, వ్యాపారం, ఇతర అవసరాల కోసం డబ్బులు అవసరమైన సమయంలో ఇంట్లోని గోల్డ్ తాకట్టు పెట్టి లోన్ తీసుకునేవారు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం బంగారం ధరలు కూడా పెరగడంతో రుణం కూడా ఎక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా గోల్డ్ లోన్ సులువుగా మంజూరు అవుతుంది. ఇందుకు ఎలాంటి సిబిల్ స్కోర్ అవసరం లేదు. అలాగే పేపర్ వర్క్ కూడా చాలా తక్కువగా ఉండటంతో పాటు వేగంగా డబ్బులు చేతికి అందిస్తారు. నెలవారీ ఈఎంఐ రూపంలో లేదా ఒకేసారి డబ్బులు చెల్లించి మీ బంగారాన్ని విడిపించుకోవచ్చు. అయితే గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటి అనేది ఇప్పుడు చూద్దాం.
గోల్డ్ లోన్ అంటే ఏంటి..?
మీ దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెడితే బ్యాంకులు రుణం అందిస్తాయి. వీటికి వడ్డీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీ బంగారాన్ని హామీగా పెట్టుకుని బ్యాంకులు రుణం మంజూరు చేస్తాయి. మీరు తీసుకున్న రుణం వడ్డీతో సహా చెల్లిస్తే బ్యాంకులు మీ గోల్డ్‌ను మీకు తిరిగి ఇచ్చేస్తాయి. ఇతర లోన్లతో పోలిస్తే వీటికి వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువమంది గోల్డ్ లోన్ తీసుకుంటూ ఉంటారు.
ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి..?
మీ బంగారం ధరను బట్టి రుణ పరిమితిని నిర్ణయిస్తారు. మీరు ఎక్కువ బంగారం తాకట్టు పెడితే ఎక్కువ లోన్ అందుతుంది. అయితే మీకు అవసరమైనదాని కంటే ఎక్కువ రుణం తీసుకోకండి. ఎందుకంటే వడ్డీ ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. అంతేకాకుండా మీరు తిరిగి చెల్లించే సమయంలో భారం కావొచ్చు. దీంతో ఎంత అవసరమో అంతే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అర్హత, అవసరాన్ని బట్టి గోల్డ్ లోన్ తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. గోల్డ్ లోన్‌పై బ్యాంకులు 8 నుంచి 11 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తాయి. బ్యాంకులను బట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. అయితే ప్రాసెసింగ్, ఆభరణాల విలువ నిర్ధారణ ఛార్జీలు, పునరుద్ధరణ ఫీజులు, ఆలస్య చెల్లింపు జరిమానాలు వంటి ఉంటాయి. దీంతో ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి. మీ ఆదాయం, ఖర్చులను బట్టి నెలవారీ ఈఎంఐ ఆప్షన్ లేదా ఒకేసారి చెల్లించడమా అనేది నిర్ణయించుకోండి. డువు తేదీకి ముందే రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఏవైనా అదనపు ఛార్జీలు ఉన్నాయా అనేది తెలుసుకోండి.