అమెరికా చరిత్రలోనే ఫస్ట్ టైమ్.. ఫ్లోరిడా ఎయిర్‌పోర్ట్‌కు ట్రంప్ పేరు

వాషింగ్టన్: తమ దేశ అధ్యక్షుడు ట్రంప్‌కు గౌరవసూచకంగా అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ ఫ్లోరిడాలోని పామ్ బీచ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పేరును ‘‘ప్రెసిడెంట్ డొనాల్డ్ జె. ట్రంప్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’’గా మార్చింది. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్ ఎయిర్ పోర్ట్ పేరు మార్పుకు సంబంధించిన చట్టంపై సంతకం చేయడంతో 2026, జులై 9 నుంచి ఈ మార్పు అధికారికంగా అమల్లోకి వచ్చింది.
అయితే, ఎయిర్ పోర్టులో నేమ్ బోర్డుల మార్పు, రెనోవేషన్‌కు కొంత సమయం పడుతుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. కాగా, అధికారంలో ఉన్న ఒక దేశాధ్యక్షుడి పేరును ఒక విమానాశ్రయానికి పెట్టడం అమెరికా చరిత్రలోనే ఇది మొదటిసారి. ఈ అరుదైన గౌరవంతో ట్రంప్ సరికొత్త చరిత్ర సృష్టించారు. పేరు మార్పు తర్వాత ఈ ఎయిర్ పోర్ట్‌లో ట్రంప్ వన్ ఫోర్స్ విమానమే ఫస్ట్ ల్యాండ్ కావడం విశేషం.
వెరీ బిగ్ డే:
తనకు దక్కిన ఈ అరుదైన గుర్తింపుపై ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ వేదికగా స్పందించారు. పామ్ బీచ్‌కు ఇది చాలా పెద్ద రోజు అని పేర్కొన్నారు. పామ్ బీచ్ ఎయిర్ పోర్టుకు తన పేరు పెట్టడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా అభివర్ణించారు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప, అత్యద్భుతమైన విమానాశ్రయాలలో ఇది ఒకటిగా నిలవబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read ; ట్రంప్‌ను వదలం.. ఖమేనీ అంతిమయాత్రలో ఇరాన్ ప్రజల నినాదాలు
పేరు మార్పుపై భిన్నాభిప్రాయాలు
మరోవైపు ఎయిర్ పోర్టు పేరు మార్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ట్రంప్ సపోర్టర్స్ దీనికి స్వాగతిస్తుండగా.. కొందరు దీనికి బలవంతపు చర్య అని విమర్శిస్తున్నారు. అమెరికా, ఫ్లోరిడాకు విశేష సేవ చేసిన ట్రంప్ పేరు ఎయిర్ పోర్టుకు పెట్టడం అభినందనీయమని ఆయన మద్దతుదారులు అంటున్నారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ట్రంప్‌కు కొత్తేమి కాదని కొందరు ఎద్దేవా చేస్తు్న్నారు.