షుగర్ పేషెంట్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక వారానికి ఒకే ఒక్క ఇన్సులిన్.. ఆ బాధలకు స్వస్తి..

మన దేశంలో షుగర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ ప్రమాదకరంగా పెరుగుతోంది. టైప్-1, అడ్వాన్స్‌డ్ టైప్-2 డయాబెటిస్ ఉన్న రోగులు తమ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంచుకోవడానికి రోజుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఇకపై ప్రతిరోజూ సూదితో గుచ్చుకోవాల్సిన అవసరం లేకుండా.. వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకునే సరికొత్త ఇన్సులిన్ అవిక్లీని నోవో నార్డిస్క్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల ఏడాదికి తీసుకోవాల్సిన ఇంజెక్షన్ల సంఖ్య 365 నుండి కేవలం 52 కి పడిపోతుంది.
ఇంజెక్షన్ల భయానికి చెక్..
దేశంలో చాలామంది రోగులు ఇన్సులిన్ వాడకాన్ని ప్రారంభించడానికి సగటున 7 నుండి 9 సంవత్సరాల పాటు ఆలస్యం చేస్తుంటారు. దీనికి ప్రధాన కారణం రోజువారీ ఇంజెక్షన్లు అంటే ఉండే భయం, నొప్పి. ఈ మానసిక, శారీరక భయాలను పోగొట్టడానికి ఈ వన్స్ వీక్లీ ఇన్సులిన్ అద్భుతంగా సహాయపడుతుందని నోవో నార్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియ తెలిపారు. ఈ సరికొత్స ఇన్సులిన్‌ను ఫ్లెక్స్‌టచ్ అనే ప్రత్యేక పెన్ డివైజ్ ద్వారా చాలా సులభంగా తీసుకోవచ్చు.
క్లినికల్ ట్రయల్స్‌లో అద్భుత ఫలితాలు..
ఆన్‌వర్డ్స్-1 క్లినికల్ ప్రోగ్రామ్ ద్వారా సేకరించిన డేటా ప్రకారం.. రోజువారీ తీసుకునే సాంప్రదాయ ఇన్సులిన్ కంటే ఈ కొత్త అవిక్లీ ఇన్సులిన్ చాలా మెరుగ్గా పనిచేస్తోందని తేలింది. ఇది రక్తంలో HbA1cను సమర్థవంతంగా తగ్గించింది. గ్లూకోజ్ లెవెల్స్ సాధారణ పరిధిలో ఉండే సమయాన్ని మెరుగుపరిచింది. టైప్-2 డయాబెటిస్ ఉన్న చాలామంది రోగులలో హైపోగ్లైసీమియా వంటి సమస్యలు లేకుండా HbA1c స్థాయిలను 7 శాతం కంటే తక్కువకు తీసుకువచ్చింది.
భారత్‌లో డయాబెటిస్ భారం ఎంత?
ఇటీవలి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS)-6 గణాంకాల ప్రకారం.. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో హై బ్లడ్ షుగర్ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. మన దేశంలో ప్రస్తుతం దాదాపు 10.1 కోట్ల మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. మరో 13.6 కోట్ల మంది ప్రి-డయాబెటిస్ దశలో ఉన్నారు. దేశంలో సుమారు 9 లక్షల మందికి పైగా టైప్-1 డయాబెటిస్ రోగులు ఉన్నారు. వీరికి ఇన్సులిన్ థెరపీ అనేది తప్పనిసరి. ఐసీఎంఆర్ నివేదికల ప్రకారం.. దేశంలో డయాబెటిస్ ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరికి మాత్రమే దీనిపై సరైన అవగాహన ఉంటుంది.
దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ ఇన్సులిన్ బ్రాండ్లలో నాలుగు బ్రాండ్లు నోవో నార్డిస్క్ సంస్థకు చెందినవే కావడం విశేషం. ఈ సరికొత్త అవిక్లీ ఇన్సులిన్ థెరపీని దేశవ్యాప్తంగా ఉన్న రోగులకు వేగంగా చేరవేయడానికి ప్రముఖ ఫార్మా సంస్థ అబాట్‌తో నోవో నార్డిస్క్ ఒప్పందం కుదుర్చుకుంది. చికిత్స విధానాన్ని సరళతరం చేయడం ద్వారా రోగులు సమయానికి ఇన్సులిన్ తీసుకోవడానికి, తద్వారా డయాబెటిస్ వల్ల వచ్చే ఇతర ఆరోగ్య సమస్యల ముప్పును తగ్గించడానికి అవిక్లీ ఒక మైలురాయిగా నిలుస్తుందని న్యూఢిల్లీ ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ ఎస్.కె. వాంగ్నూ అభిప్రాయపడ్డారు.