July 10, 2026

స్కానింగ్ కోసం 2 కి.మీ. జగిత్యాల క్రిటికల్ కేర్ యూనిట్‌‌లో అబ్డామిన్ స్కానింగ్ మిషన్ కరువు

స్కానింగ్ కోసం 2 కి.మీ.  జగిత్యాల క్రిటికల్ కేర్ యూనిట్‌‌లో అబ్డామిన్ స్కానింగ్ మిషన్ కరువు
Reading Time: 2 minutes

స్కానింగ్ కోసం 2 కి.మీ. జగిత్యాల క్రిటికల్ కేర్ యూనిట్‌‌లో అబ్డామిన్ స్కానింగ్ మిషన్ కరువు

Caption of Image.
  • రోజూ పేషెంట్లను పాత ఆస్పత్రికి తరలింపు
  • ఆలస్యమవుతున్న ట్రీట్​మెంట్.. రోగులకు తీవ్ర ఇబ్బందులు
  • గంటల తరబడి వెయిటింగ్.. వృద్ధులకు తప్పని తిప్పలు

జగిత్యాల, వెలుగు:ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అత్యవసర చికిత్స అందించాల్సిన క్రిటికల్ కేర్ యూనిట్‌‌‌‌లోని కీలకమైన అబ్డామిన్ స్కానింగ్(ఓఎస్డీ) మెషీన్ లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జగిత్యాల జిల్లా ఆస్పత్రి బస్ డిపో సమీపంలో కొద్ది నెలల క్రితం ప్రారంభమైన క్రిటికల్ కేర్ యూనిట్‌‌లో ఓఎస్డీ లేకపోవడంతో ప్రతిరోజూ పేషెంట్లను రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాత బస్టాండ్‌‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. దీంతో వృథా కావడంతో పాటు రోగులు, వారి కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పేషెంట్లు​ అటూ, ఇటూ..
క్రిటికల్ ​కేర్​యూనిట్​లో ఉదయం 10 గంటలకు ఓపీకి వచ్చిన పేషెంట్‌‌ను డాక్టర్ పరీక్షించి అబ్డామిన్ స్కాన్ అవసరమని సూచిస్తే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్‌‌లో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాత ప్రభుత్వ ఆస్పత్రికి పంపిస్తున్నారు. అక్కడ స్కానింగ్ పూర్తయ్యాక గంట నుంచి రెండు గంటల తర్వాత మళ్లీ క్రిటికల్ కేర్ యూనిట్‌‌కు తీసుకొస్తున్నారు. ఆ సమయానికి సంబంధిత డాక్టర్ అందుబాటులో లేకపోతే డ్యూటీ డాక్టర్‌‌ను సంప్రదించాల్సి వస్తోంది. లేదంటే రోగులు మరుసటి రోజు వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది.

రోజూ 20–25 మంది అవస్థలు
క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రోజుకు 20 నుంచి 25 మంది వరకు పేషెంట్లను స్కానింగ్ కోసం పాత ఆస్పత్రికి తరలిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో చికిత్సలో ఆలస్యమవడం రోగులకు ప్రాణసంకటంగా మారుతోంది. 

స్కానింగ్ కోసం తరలిస్తున్న వారిలో ఎక్కువ మంది వృద్ధులే ఉంటున్నారు. అంబులెన్స్‌‌లో ఆస్పత్రుల మధ్య ప్రయాణించే సమయంలో  కొందరు అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయిన ఘటనలు కూడా జరిగినట్లు సమాచారం. తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులను ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తరలిస్తుండడంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎంసీహెచ్‌‌లోనూ అధిక భారం
క్రిటికల్ కేర్ యూనిట్‌‌కు సమీపంలోని ఎంసీహెచ్‌‌లో స్కానింగ్ సౌకర్యం ఉన్నప్పటికీ అక్కడ ప్రతిరోజూ 50 నుంచి 60 మంది గర్భిణులు పరీక్షల కోసం  వస్తున్నారు. ఇప్పటికే అధిక పని భారం ఉండడంతో ఇతర రోగులకు అదనంగా సేవలు అందించడం సాధ్యం కాదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. 

క్రిటికల్ కేర్ యూనిట్‌‌లో ప్రత్యేకంగా అబ్డామిన్ స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తే రోగుల ఇబ్బందులకు వెంటనే పరిష్కారం లభిస్తుందని పేర్కొంటున్నారు. అత్యవసర రోగులకు అదే భవనంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటే విలువైన సమయం ఆదా కావడంతో పాటు చికిత్స వేగంగా అందే అవకాశం ఉంటుంది.

©️ VIL Media Pvt Ltd.