July 11, 2026

CM Revanth Reddy: యువతకు సీఎం సంచలన ఆఫర్.. క్రీడా విజేతలకు ఉద్యోగాల గ్యారెంటీ

CM Revanth Reddy: యువతకు సీఎం సంచలన ఆఫర్.. క్రీడా విజేతలకు ఉద్యోగాల గ్యారెంటీ
Reading Time: 2 minutes
Revanth Reddy Sports Jobs Guarantee

CM Revanth Reddy: గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన “యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (YIPESU)”ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువతను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ.. యువకులే ఈ దేశానికి అసలైన సంపద అని కొనియాడారు. ప్రపంచ దేశాలతో పోల్చితే ఒలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత్ అత్యంత వెనుకబడి ఉండటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వాలకు క్రీడల పట్ల ఒక నిర్దిష్టమైన విధానం (పాలసీ) లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. అప్పుడప్పుడు పీటీ ఉష లాంటి కొద్దిమంది క్రీడాకారులు తమ సొంత ప్రతిభతో దేశానికి పేరు తెచ్చారే తప్ప, అంతర్జాతీయంగా భారత్‌ను క్రీడల్లో రాణించిన దేశంగా ఇంకా గుర్తించడం లేదని, ఆ లోటును భర్తీ చేయడానికే తెలంగాణ ప్రభుత్వం సరికొత్త క్రీడా విధానాన్ని తీసుకొచ్చిందని స్పష్టం చేశారు.

పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో సరికొత్త క్రీడా పాలసీ

తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా మార్చేందుకు ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) విధానంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. క్రీడల ప్రాధాన్యతను వివరిస్తూ.. నాాడు క్రీడల్లో అద్భుతంగా రాణించడం వల్లే పీటీ ఉషకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని, ఆ ప్రతిభే నేడు ఆమెను రాజ్యసభ సభ్యురాలి స్థాయికి చేర్చిందని యువతకు ఉదాహరణగా చెప్పారు. క్రీడాకారులు తమ లక్ష్యాన్ని చేరాలంటే వంద శాతం కష్టపడాల్సిందేనని, కష్టపడే ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

2028 నాటికి స్పోర్ట్స్ అకాడమీ.. విజేతలకు ఉద్యోగాల గ్యారెంటీ

రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేలా, ఒక వేదికగా తెలంగాణను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగానే డిసెంబర్ 2028 నాటికి అత్యాధునిక సదుపాయాలతో కూడిన “తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీ”ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. క్రీడలను కేవలం ఒక హాబీగా కాకుండా కెరీర్‌గా ఎంచుకున్నా అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని యువతకు ధైర్యం చెప్పారు. అంతర్జాతీయ, జాతీయ వేదికలపై రాణించిన క్రీడాకారులకు భారీ నగదు పారితోషికాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని, దేశానికి పతకాలు తెచ్చే ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను తమ ప్రభుత్వమే పూర్తిగా తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.