July 9, 2026

Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..

Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
Reading Time: < 1 minute
Urea Booking Online Through Meeseva Centres Farmers Subsidy

రాష్ట్రంలోని రైతులకు సబ్సిడీ యూరియా పంపిణీని మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సాంకేతిక కారణాల వల్ల లేదా స్మార్ట్‌ఫోన్ వాడకం తెలియక ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోలేని రైతుల కోసం సరికొత్త మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మీసేవ కేంద్రాల ద్వారా రైతులు సులభంగా యూరియా బుకింగ్ చేసుకోవచ్చు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలోని మీసేవ విభాగం, వ్యవసాయ శాఖతో కలిసి ఈ సరికొత్త సేవలను రైతులకు ఉమ్మడిగా అందిస్తోంది.

ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలనుకునే రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్ (PPB) నంబర్‌తో సమీపంలోని మీసేవ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ మీసేవ ఆపరేటర్ రైతు సాగు విస్తీర్ణం, పంట వివరాలను ఆన్‌లైన్ సిస్టమ్‌లో నమోదు చేస్తారు. అనంతరం రైతు తనకు అనుకూలమైన ఎరువుల డీలర్‌ను ఎంచుకుని, అవసరమైన యూరియా పరిమాణాన్ని బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో పాస్‌బుక్‌తో అనుసంధానమైన రైతు మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP)ని ధృవీకరించిన వెంటనే ఒక బుకింగ్ ఐడీ జారీ అవుతుంది. కేవలం పది రూపాయల నామమాత్రపు సేవా రుసుముతో రైతులు ఈ సదుపాయాన్ని పొందవచ్చు.

రైతులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. మీసేవ ద్వారా పొందిన ఈ బుకింగ్ ఐడీ బుక్ చేసిన తేదీ కాకుండా కేవలం 48 గంటల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. కాబట్టి రైతులు ఆ గడువు ముగిసేలోపే తాము ఎంపిక చేసుకున్న ఎరువుల డీలర్‌ను కలిసి సబ్సిడీ యూరియాను కొనుగోలు చేయాలి. ఈ ప్రక్రియ సజావుగా సాగడానికి రైతులు తమ పాస్‌బుక్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి. రైతులందరూ అధికారిక యాప్ లేదా మీసేవ ద్వారానే యూరియా బుక్ చేసుకోవాలని.. ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) లేదా మండల వ్యవసాయ అధికారి (MAO)ని సంప్రదించాలని మీసేవ కమిషనర్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.