July 10, 2026

ప్రెగ్నెన్సీలో రిస్క్‌కు చెక్.. ఏఐ మోడల్‌తో ముందస్తు గుర్తింపు

ప్రెగ్నెన్సీలో రిస్క్‌కు చెక్.. ఏఐ మోడల్‌తో ముందస్తు గుర్తింపు
Reading Time: 2 minutes

ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వాలని ప్రతి తల్లీ ఎన్నో కలలు కంటుంది. కానీ, గర్భధారణ సమయంలో వచ్చే ‘ప్రీ-ఎక్లాంప్సియా’ అనే సమస్య ఆ ఆనందాన్ని దూరం చేస్తుంది. సమయానికి గుర్తించకపోతే ఇది తల్లీబిడ్డ ఇద్దరికీ ప్రాణాంతకంగా మారుతుంది. అయితే ఇప్పుడు వైద్య రంగంలోకి వచ్చిన సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ఈ ప్రమాదాన్ని ముందే పసిగడుతోంది. ‘ప్రాంప్ట్‌’ (PROMPT) అనే ఏఐ మోడల్‌తో గర్భిణుల రిస్క్‌ను ముందే ఎలా అంచనా వేయవచ్చో ఇప్పుడు చూద్దాం..

ప్రీ-ఎక్లాంప్సియా అంటే ఏంటి?: గర్భం దాల్చిన 20 వారాల తర్వాత కొందరిలో అకస్మాత్తుగా అధిక రక్తపోటు (High BP) రావడం, అలాగే మూత్రంలో ప్రోటీన్ లీక్ అవ్వడాన్ని ప్రీ-ఎక్లాంప్సియా అంటారు. ఇది కేవలం బీపీ సమస్య మాత్రమే కాదు.. సకాలంలో చికిత్స అందించకపోతే గర్భిణుల కాలేయం మూత్రపిండాలు వంటి ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తుంది. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు.

కంటి ఫొటోతో రిస్క్ గుర్తింపు: ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితిని ముందే కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు ‘ప్రాంప్ట్‌’ (PROMPT) అనే ఏఐ మోడల్‌ను రూపొందించారు. ‘పబ్‌మెడ్‌ సెంట్రల్‌’ జర్నల్ ప్రకారం.. ఈ టెక్నాలజీతో గర్భిణి కంటి రెటీనాను ఫొటో తీసి అందులోని సూక్ష్మ రక్తనాళాల నమూనాలను విశ్లేషిస్తారు.ఇక ఈ కంటి ఫొటోలు, బీపీ రీడింగ్స్ ఆధారంగా ఆ తల్లికి భవిష్యత్తులో ప్రీ-ఎక్లాంప్సియా వచ్చే ఛాన్స్ ఉందో లేదో ఏఐ ముందే చెప్పేస్తుంది.

ఈ లక్షణాలు ఉంటే అలర్ట్ అవ్వాలి: గర్భధారణ సమయంలో కొన్ని మార్పులు వస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇక రక్తపోటు 140/90 కంటే ఎక్కువగా ఉండడం, ముఖం, చేతులు లేదా పాదాలలో అకస్మాత్తుగా వాపు రావడం తీవ్రమైన తలనొప్పి, కంటిచూపు మసకబారడం వంటివి దీని ప్రధాన లక్షణాలు. అలాగే కుడివైపు పై పొట్టలో నొప్పి, వికారం వాంతులు కావడం హఠాత్తుగా బరువు పెరగడం మూత్రం తగ్గిపోవడం జరిగితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

Early Pregnancy Risk Detection Gets Smarter with AI Technology
Early Pregnancy Risk Detection Gets Smarter with AI Technology

ఎవరికి ప్రమాదం ఎక్కువ?: ఈ సమస్య ఎవరికైనా రావచ్చు, కానీ కొందరిలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మొదటిసారి గర్భం దాల్చిన వారు 35 ఏళ్ల వయస్సు దాటిన గర్భిణులకు ఈ ముప్పు ఎక్కువ. అలాగే గత ప్రెగ్నెన్సీలో ప్రీ-ఎక్లాంప్సియా వచ్చిన హిస్టరీ ఉన్నా ఊబకాయం, మధుమేహం, లేదా అంతకుముందే దీర్ఘకాలిక రక్తపోటు సమస్యలు ఉన్నవారికి ఈ ప్రమాదం పొంచి ఉంటుంది.

సాంకేతికత పెరుగుతున్న కొద్దీ వైద్య రంగంలో అద్భుతాలు జరుగుతున్నాయి. గర్భిణులకు శాపంగా మారిన ప్రీ-ఎక్లాంప్సియాను ‘PROMPT’ ఏఐ మోడల్ ద్వారా ముందే గుర్తించడం నిజంగా గర్భిణులకు ఒక పెద్ద వరం. సరైన సమయంలో స్క్రీనింగ్ చేయించుకోవడం, డాక్టర్ల సలహాలు పాటించడం ద్వారా ప్రెగ్నెన్సీ రిస్క్‌కు సులభంగా చెక్ పెట్టవచ్చు.

The post ప్రెగ్నెన్సీలో రిస్క్‌కు చెక్.. ఏఐ మోడల్‌తో ముందస్తు గుర్తింపు appeared first on Manalokam – Latest Telugu News & Updates.