ట్రంప్ నోరు పారేసుకున్నాడు.. మనోళ్లు 9 లక్షల కోట్లు నష్టపోయారు.. స్టాక్ మార్కెట్ లో రక్త కన్నీరు

అమెరికా అధ్యక్షుడు ఇరాన్ శాంతి ఒప్పందాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు చేసిన ప్రకటనతో నిమిషాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇరాన్ తో యుద్ధం మళ్లీ మెుదటికి వస్తుందనే భయాలు ఇన్వెస్టర్లను వణికించాయి. దీంతో అందరూ ఒక్కసారిగా అమ్మకాలకు దిగటం సూచీలపై ఒత్తిడిని పెంచేసింది. ఇంట్రాడేలో 1900 పాయింట్లు పతనం అయిన సెన్సెక్స్ క్లోజింగ్ నాటికి 1677 పాయింట్ల నష్టంతో ఉంది. ఇక నిఫ్టీ 516 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 1458 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 962 పాయింట్ల మేర పతనం అయ్యాయి బుధవారం క్లోజింగ్ సెషన్లో. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.9 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది కొన్ని గంటల్లోనే.
స్టాక్ మార్కెట్ల పతనానికి కీలక కారణాలు ఇవే..
ఇరాన్ తో ముగిసిన శాంతి ఒప్పందం:
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని ప్రకటించడం ప్రపంచ మార్కెట్లలో ఆందోళనకు కారణమైంది. ఇరాన్‌తో కుదిరిన అవగాహన ఒప్పందం ఇక కొనసాగదని, తాను టెహ్రాన్‌తో చర్చలకు ఆసక్తి చూపడం లేదని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో రిస్క్ ఉన్న ఆస్తుల నుంచి పెట్టుబడిదారులు వెనక్కి తగ్గడం ప్రారంభించారు.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం:
అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్ల పతనానికి ప్రధాన కారణంగా మారాయి. ఇరువైపుల నుంచి తాజా దాడుల వార్తలు రావడంతో మధ్యప్రాచ్య పరిస్థితులపై అనిశ్చితి పెరిగింది. దీని ప్రభావంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు అప్రమత్తంగా మారగా.. భారత మార్కెట్లు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలతో కొత్త భయం:
మార్కెట్ల బలహీనతకు మరో ప్రధాన కారణం ముడిచమురు ధరల పెరుగుదల. బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 76 డాలర్ల స్థాయికి చేరుకోవడంతో భారత్‌పై ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో ప్రధాన చమురు దిగుమతి దేశాల్లో ఒకటైన భారత్‌కు క్రూడ్ ధరలు పెరగడం దిగుమతి బిల్లును పెంచడంతో పాటు ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
విదేశీ పెట్టుబడులపై ప్రభావం ఉంటుందా?
ఇటీవల భారత మార్కెట్లలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల కొనుగోళ్లు పెరగడం మార్కెట్‌కు సానుకూల సంకేతంగా మారింది. గత 3 రోజుల్లో ఎఫ్‌ఐఐలు భారత ఈక్విటీల్లో సుమారు రూ.1,991 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు నిపుణులు తెలిపారు. అయితే భౌగోళిక ఉద్రిక్తతలు మరింత పెరిగితే ఈ పెట్టుబడులపై ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఓలాటిలిటీ పెరిగింది.. షేర్లలో అమ్మకాలు:
మార్కెట్‌లో భయాన్ని సూచించే ఇండియా VIX సూచీ 23 శాతానికి పైగా పెరిగి 14.33 స్థాయికి చేరుకుంది. ఇది ఇన్వెస్టర్లలో పెరిగిన అనిశ్చితిని సూచిస్తోంది. బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, హెల్త్‌కేర్ రంగ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి.
మారుతి సుజుకి, ఇండిగో, హిందుస్థాన్ యూనిలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి ప్రముఖ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. సాంకేతికంగా కూడా నిఫ్టీకి సమీప కాలంలో జాగ్రత్త అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ పరిణామాలు, క్రూడ్ ధరల కదలికలు రాబోయే రోజుల్లో మార్కెట్ దిశను నిర్ణయించనున్నాయి.