July 10, 2026

తుంగభద్రకు పోటెత్తిన వరద: మరో 4 రోజులు ఇలాగే ఉంటే శ్రీశైలానికి నీళ్లు

తుంగభద్రకు పోటెత్తిన వరద: మరో 4 రోజులు ఇలాగే ఉంటే శ్రీశైలానికి నీళ్లు
Reading Time: 2 minutes

తుంగభద్రకు పోటెత్తిన వరద: మరో 4 రోజులు ఇలాగే ఉంటే శ్రీశైలానికి నీళ్లు

Caption of Image.

హైదరాబాద్: కర్ణాటక రాష్ట్రం పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్రకు ఆశాజనకంగా వరద మొదలైంది. ఆలస్యంగానైనా వరద చేరికతో తుంగభద్ర డ్యాంలో జలకళ కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలకు జీవనాడి శ్రీశైలం జలాశయం తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. గత ఏడాది ఈ సమయానికే గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తే.. ఈ ఏడాది నీటి చుక్క జాడ లేదు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కి.. శ్రీశైలం గేట్లు ఎత్తే అద్భుత ఘట్టం కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

రాయలసీమ జిల్లాలకు ప్రాణాధారమైన తుంగభద్ర జలాశయానికి శుక్రవారం (జులై 10) ఉదయనికి 40వేల క్యూసెక్కులు పైగా వరద వచ్చి చేరుతుంది. ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. డ్యాం గరిష్ట నీటి మట్టం 1,633 అడుగులు, ప్రస్తుతం 1596.34 అడుగులుగా ఉంది. డ్యాం పూర్తి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17.155 టీఎంసీల వరద చేరింది. ఎగువన తుంగ డ్యాంకు వరద పోటెత్తడంతో 22 గేట్లేత్తి 26,500 క్యూసె క్కులు విడుదల చేస్తున్నారు. 

శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో తుంగభద్ర జలాశయానికి సగటున 44,315 క్యూసెక్కులు వరద చేరుతుందని టీబీపీ బోర్డు అధికారులు తెలిపారు. గత ఏడాది ఈ సమయానికి 1,624.81 అడుగల లెవల్లో 75.934 టీఎంసీలు చేరడమే కాకుండా 52,423 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండడంతో గేట్లు ఎత్తేసి 61.145 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. ఈ ఏడాది ఆలస్యంగా వరద ప్రవాహం ప్రారంభమైంది.

కృష్ణమ్మ కోసం ఎదురుచూపులు

తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన శ్రీశైలం జలాశయానికి నీటి జాడ కనిపించడం లేదు. గత ఏడాది జూలై 8న సీఎం చంద్రబాబు శ్రీశైలం క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువన నాగార్జున సాగర్‎కు నీటిని విడు దల చేశారు. ప్రస్తుతం కనుచూపు మేరలో కూడా ఆ పరిస్థితి కనిపించడం లేదు. డ్యాం గరిష్ట నీటి మట్టం 885 అడుగుల కాగా, ప్రస్తుతం 821.60 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా,  42.0197 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. 

ఎగువన జూరాల ప్రాజెక్టు దాటి వరద అడుగులు పడకపోవడంతో శ్రీశైలానికి నీటి చుక్క జాడ లేదు. అయితే.. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వరదలకు ఆల్మట్టి జలాశయానికి 1,26,373 క్యూసెక్కుల వరద చేరుతుంది. ఇది కొంత ఆశలు కల్పిస్తున్నా. ఆల్మట్టి, నారాయణపుర్, జూరాల ప్రాజెక్టులు నిండిన తరువాత శ్రీశైలానికి వరద మొదలవుతుంది.

 
 

©️ VIL Media Pvt Ltd.