AP Government: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఈ నెల 13న ప్రారంభం..

తూర్పుగోదావరి జిల్లాలోని చారిత్రాత్మక ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్ల ఏర్పాటుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. బ్యారేజీ భద్రత, ఆధునీకరణలో భాగంగా ఈనెల 13వ తేదీ సోమవారం నాడు కొత్త గేట్ల ఏర్పాటు పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం సుమారు 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ను కేటాయించగా, దీని ద్వారా బ్యారేజీకి సంబంధించిన మొత్తం 117 కొత్త గేట్ల ఏర్పాటు పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 13న ఉదయం 10:00 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ద్వారా ధవళేశ్వరం చేరుకుంటారు. అక్కడ నుండి నేరుగా ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు చేరుకుని ఉదయం 10:25 గంటలకు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. గేట్ల పునర్నిర్మాణ పనులను ప్రారంభించిన అనంతరం, స్థానిక రైతాంగంతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాగునీటి సరఫరా, బ్యారేజీ ఆధునీకరణ వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలపై వారితో చర్చిస్తారు.
ఈ కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు అక్కడి నుండి నేరుగా పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన నిమిత్తం బయలుదేరి వెళ్తారు. ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో తూర్పుగోదావరి జిల్లా ఉన్నతాధికారులు, నీటిపారుదల శాఖ సిబ్బంది ధవళేశ్వరం బ్యారేజీ వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రాక కోసం హెలిప్యాడ్ నిర్మాణం, శిలాఫలక ఆవిష్కరణ వేదిక, భద్రతా చర్యలు మరియు రైతుల సమావేశ ప్రాంగణాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.