July 8, 2026

పసుపు ఆరోగ్యానికి మంచిదే.. కానీ మోతాదు మించితే?

పసుపు ఆరోగ్యానికి మంచిదే.. కానీ మోతాదు మించితే?
Reading Time: 2 minutes

మన వంటింట్లో పసుపుకు ఉన్న ప్రాధాన్యతే వేరు. శతాబ్దాలుగా ఆయుర్వేదంలో దీనిని ఒక గొప్ప ఔషధంగా వాడుతున్నారు. కూరల్లో రంగు కోసం, రుచి కోసమే కాకుండా.. యాంటీబయాటిక్‌గా కూడా పసుపు మనకు ఎంతో మేలు చేస్తుంది. అయితే ఎంతటి అమృతమైనా మోతాదు మించితే విషమే అవుతుంది కదా, అలాగే పసుపును కూడా అతిగా వాడినా కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు తీసుకున్నా లేనిపోని ఇబ్బందులు వస్తాయి. మరి పసుపు వల్ల వచ్చే ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు సింపుల్‌గా తెలుసుకుందాం.

రక్తం పలచబడటం, సర్జరీ ముప్పు: పసుపుకు రక్తాన్ని పలచబరిచే గుణం ఉంది. అందువల్ల, ఇప్పటికే రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు మందులు వాడుతున్న వారు పసుపును ఎక్కువగా తీసుకోకూడదు. ఇది ఆ మందుల పనితీరుపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు, ఏదైనా ఆపరేషన్ లేదా శస్త్రచికిత్స జరగడానికి కనీసం రెండు వారాల ముందే పసుపు సప్లిమెంట్లను వాడటం పూర్తిగా మానేయడం చాలా మంచిది.

Too Much Turmeric? Know the Possible Side Effects
Too Much Turmeric? Know the Possible Side Effects

కడుపు సమస్యలు మరియు అలెర్జీలు: పసుపును మోతాదుకు మించి ఎక్కువగా వాడటం వల్ల కొందరిలో జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. దీనివల్ల కడుపు నొప్పి, వికారం, వాంతులు కావడం విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే, మరికొంతమంది శరీర తత్వానికి పసుపు అస్సలు పడదు. అలాంటి వారిలో ఇది చర్మంపై దద్దుర్లు, దురద వంటి రకరకాల అలెర్జీలకు కారణం కావచ్చు.

కిడ్నీలో రాళ్లు – కాలేయ వ్యాధులు: అతిగా పసుపు తీసుకోవడం వల్ల మూత్రపిండాలలో (కిడ్నీల్లో) రాళ్లు వచ్చే ప్రమాదం చాలా వరకు పెరుగుతుంది. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఇక దీనితో పాటు, ఇప్పటికే లివర్ లేదా కాలేయ వ్యాధులు ఉన్నట్లు నిర్ధారణ అయిన వారు పసుపును ఎక్కువ మోతాదులో తీసుకుంటే, వారి కాలేయ సమస్యలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోవచ్చు: లో బీపీ తో బాధపడేవారు పసుపును అతిగా వాడితే వారి రక్తపోటు మరింత పడిపోయి ప్రమాదకరంగా మారుతుంది. అలాగే ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా ఒక్కసారిగా తగ్గించేస్తుంది. ఇక అందువల్ల షుగర్ వ్యాధికి మందులు వాడుతున్న వారు పసుపును పరిమితంగానే వాడుకోవాలి, లేదంటే షుగర్ లెవెల్స్ మరీ డౌన్ అయిపోయే ఛాన్స్ ఉంది.

పసుపు అనేది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక అద్భుతమైన సంప్రదాయ ఔషధం. అయితే దానిని రోజువారీ వంటల్లో వాడేంత మోతాదులో తీసుకుంటే ఎలాంటి ముప్పూ ఉండదు. కానీ, ఔషధాల రూపంలో విపరీతంగా వాడే ముందే కాస్త ఆలోచించాలి.

గమనిక: మీకు పైన పేర్కొన్న ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే లేదా మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధికి మందులు వాడుతుంటే, పసుపును ఎక్కువ మోతాదులో తీసుకునే ముందు లేదా పసుపు సప్లిమెంట్లు వాడే ముందు ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ఉత్తమం.

The post పసుపు ఆరోగ్యానికి మంచిదే.. కానీ మోతాదు మించితే? appeared first on Manalokam – Latest Telugu News & Updates.