Reading Time: 2 minutes

ఏ తప్పులు చేస్తే అద్దెకు ఉన్నోళ్లను ఓనర్స్ ఖాళీ చేయించొచ్చు.. చట్టం ఏం చెబుతోందంటే?

Caption of Image.

ఇల్లు అద్దెకు ఇవ్వడం అనేది ఒక సాధారణ వ్యవహారంలా కనిపించినా.. చాలాసార్లు అది యజమానులు, అద్దెదారుల మధ్య పెద్ద గొడవలకు దారితీస్తుంటుంది. కొందరు అద్దెదారులు నెలల తరబడి అద్దె చెల్లించకుండా ఇంటిని ఖాళీ చేయకుండా ఉండటం, యజమాని అనుమతి లేకుండా మరొకరికి సబ్‌లీజ్ చేయడం, అక్రమ కార్యకలాపాలకు ఉపయోగించడం వంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తుంటాయి. మరోవైపు కొందరు యజమానులు చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితులకు సమతుల్య పరిష్కారం చూపేందుకు రూపొందించిన మోడల్ టెనెన్సీ చట్టం–2021లో అద్దె ఇళ్లకు సంబంధించిన స్పష్టమైన రూల్స్ ఉన్నాయి.

ఒప్పందం ఉన్నంత వరకు బలవంతపు ఖాళీ కుదరదు..
చట్టంలోని సెక్షన్ 21(1) ప్రకారం రెంటల్ అగ్రిమెంట్ అమల్లో ఉన్నంత వరకు అద్దెదారును యజమాని తన ఇష్టానుసారం ఖాళీ చేయించలేడు. చట్టంలో పేర్కొన్న కారణాలు లేదా ఇరువురి మధ్య లిఖితపూర్వకంగా అంగీకరించిన నిబంధనలు ఉంటేనే చర్యలు తీసుకోవచ్చు. అంతేకాదు అద్దెదారును బలవంతంగా బయటకు పంపడం, విద్యుత్, నీరు వంటి అవసరమైన సేవలను నిలిపివేయడం వంటి చర్యలు కూడా చట్టవిరుద్ధమే. ఖాళీ చేయించాలంటే తప్పనిసరిగా రెంట్ కోర్టును ఆశ్రయించి ఆదేశాలు పొందాల్సిందే.

ఎలాంటి పరిస్థితుల్లో ఖాళీ చేయించవచ్చు?
సెక్షన్ 21(2) ప్రకారం.. అద్దెదారు వరుసగా రెండు నెలలు అద్దె చెల్లించకుండా, నోటీసు ఇచ్చిన తర్వాత కూడా బకాయిలు చెల్లించకపోతే యజమాని రెంట్ కోర్టులో ఖాళీ చేయించాలని కోరవచ్చు. అయితే నోటీసు అందిన నెల రోజుల్లోపు బకాయిలు, వడ్డీతో సహా చెల్లిస్తే ఆ కారణంతో ఖాళీ చేయించలేరు. అయితే ఈ వెసులుబాటు ఒకసారి మాత్రమే వర్తిస్తుంది. అలాగే యజమాని అనుమతి లేకుండా సబ్‌లీజ్ చేయడం, అక్రమ కార్యకలాపాలకు ఇంటిని వినియోగించడం, అదనపు స్థలాన్ని ఆక్రమించడం, శాశ్వత నిర్మాణాలు చేయడం లేదా ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడినా కూడా ఖాళీ చేయించే అవకాశం ఉంటుంది.

ALSO READ : సోలార్ రూఫ్టాప్ల ప్రోత్సహం.. వరల్డ్‌ బ్యాంక్ నుంచి రూ.8,500 కోట్ల అప్పు.. 

ఖాళీ చేయకపోతే భారీ జరిమానా..
సెక్షన్ 23 ప్రకారం.. రెంటల్ అగ్రిమెంట్ ముగిసిన తర్వాత కూడా ఇంటిని ఖాళీ చేయకుండా ఉంటే తొలి రెండు నెలలు నెలవారీ అద్దెకు రెండింతలు, ఆ తర్వాత నాలుగు రెట్లు పరిహారంగా యజమానికి చెల్లించాల్సి ఉంటుంది. అద్దె బకాయిలు కాకుండా ఇతర కారణాలతో కేసు నడుస్తున్న సమయంలో కూడా అద్దెదారు అద్దె, ఇతర చార్జీలు చెల్లించేలా రెంట్ కోర్టు ఆదేశాలు ఇవ్వవచ్చు. దీంతో కేసు పేరుతో ఉచితంగా ఇంటిని వినియోగించే అవకాశాన్ని చట్టం నిరోధిస్తుంది. యజమానుల హక్కులను కాపాడటంతో పాటు అద్దెదారులకూ చట్టపరమైన రక్షణ కల్పించడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యం.

©️ VIL Media Pvt Ltd.