ట్రంప్ ఒక్క మాటతో భారత మార్కెట్లలో కలకలం.. అరగంటలో 1000 పాయింట్లు ఆవిరి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా కామెంట్స్ భారత స్టాక్ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించాయి. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని ట్రంప్ ప్రకటించడం, అమెరికా మరోసారి దాడులు ప్రారంభించిందనే వార్తలతో ఇన్వెస్టర్లలో ఆందోళన పెరిగింది. దీంతో బుధవారం దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల దిశగా కొనసాగుతున్నాయి. భౌగోళిక ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల, గ్లోబల్ మార్కెట్ల బలహీనతలు కలిసి మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
సెన్సెక్స్ 1,700 పాయింట్లు డౌన్..
బుధవారం మధ్యాహ్నం ట్రేడింగ్ సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1700 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 500 పాయింట్లకు పైగా నష్టాలతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. దీంతో మెటల్, ఫార్మా, రియల్టీ మినహా మిగతా అన్ని రంగాలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.24 శాతం, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.12 శాతం క్షీణించాయి.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలే కారణం..
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం ఇన్వెస్టర్లలో భయాలను పెంచింది. ఇరాన్‌తో కుదిరిన అవగాహన ఒప్పందం ఇక అమల్లో లేదని ట్రంప్ చేసిన ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. ఇప్పటికే యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ఒత్తిడిలో ఉన్న మార్కెట్లకు ఈ పరిణామం మరింత ప్రతికూల సంకేతాలను ఇచ్చింది. దీంతో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా బ్రెంట్ క్రూడ్ ధరలు మళ్లీ పెరగడం మార్కెట్లను అనిశ్చిత పరిస్థితుల్లోకి నెట్టిందని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ పేర్కొన్నారు.
క్రూడ్ ఆయిల్ షాక్.. భారత్‌పై ఒత్తిడి
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధరలు భారీగా పెరిగి బ్యారెల్‌కు 78 డాలర్ల స్థాయికి చేరాయి. ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారైన భారత్‌కు ఇది ప్రతికూల పరిణామంగా మారింది. క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగితే దేశ దిగుమతి బిల్లు పెరగడంతో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరుగుతాయి. రూపాయి విలువపై కూడా ప్రభావం పడే అవకాశం ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు.
ALSO READ : PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. జూలై 15న వడ్డీ డిపాజిట్
ఆయిల్, ఆటో, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాలు
క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల ప్రభావంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఇండియన్ ఆయిల్ షేర్లలో అమ్మకాలు కనిపించాయి. అదే విధంగా ఏషియన్ పెయింట్స్, ఇండిగో, ఐటీసీ వంటి నిఫ్టీ 50 షేర్లు ప్రధాన నష్టాలను నమోదు చేశాయి. మరోవైపు క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేసే ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా షేర్లు మాత్రం క్రూడ్ ధరల పెరుగుదలతో స్వల్ప లాభాల్లో ట్రేడయ్యాయి.
రక్షణాత్మక రంగాల వైపు ఇన్వెస్టర్ల చూపు..
అంతర్జాతీయ అనిశ్చితి సమయంలో పెట్టుబడిదారులు రక్షణాత్మక రంగాల వైపు మొగ్గు చూపారు. ఫార్మా, హెల్త్‌కేర్ షేర్లు సుమారు 0.5 శాతం పెరిగాయి. ముడిచమురు ధరల ప్రభావం తక్కువగా ఉండే రంగాలపై ఆసక్తి పెరిగింది. ఇంటర్నెట్ సేవల సంస్థ ఇన్ఫో ఎడ్జ్ 3.1 శాతం, క్వార్టర్ బిజినెస్ అప్‌డేట్స్ బలంగా ఉండటంతో కల్యాణ్ జ్యువెలర్స్ 5.4 శాతం పెరిగాయి.
పెరిగిన భయం.. ఎగిసిన ఇండియా VIX
మార్కెట్ అస్థిరతను సూచించే ఇండియా VIX సూచీ దాదాపు 30 శాతం పెరిగి 15.08 స్థాయికి చేరుకుంది. ఇది ఇన్వెస్టర్లలో పెరిగిన రిస్క్ భయాన్ని సూచిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల బలహీనత కూడా దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పీ సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి. అమెరికా మార్కెట్లు కూడా మంగళవారం నష్టాలతో ముగియడం ప్రతికూల ప్రభావాన్ని చూపింది.
రూపాయిపై ఒత్తిడి
భౌగోళిక ఉద్రిక్తతలు, పెరిగిన చమురు ధరల కారణంగా డాలర్ బలపడటంతో రూపాయి విలువ తగ్గింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి 20 పైసలు బలహీనపడి డాలర్‌తో పోలిస్తే 95.16 స్థాయికి చేరుకుంది. మెుత్తానికి ట్రంప్ వ్యాఖ్యలతో ప్రారంభమైన ఈ అనిశ్చితి ఎంతకాలం కొనసాగుతుందనే విషయం ఇప్పుడు మార్కెట్ వర్గాలకు ప్రధాన ప్రశ్నగా మారింది. క్రూడ్ ధరలు, యుద్ధ పరిస్థితుల పరిణామాలు, అంతర్జాతీయ పెట్టుబడిదారుల వైఖరి రానున్న రోజుల్లో భారత మార్కెట్ల దిశను నిర్ణయించనున్నాయి.