July 9, 2026

AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి రైతులకు భారీ ఊరట..

AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి రైతులకు భారీ ఊరట..
Reading Time: < 1 minute
Ap Cabinet Meeting Amaravati Farmers Relief Industrial Investments Approval

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఉదయం 10:30 గంటలకు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి, భూములు ఇచ్చిన రైతులకు ప్రయోజనాలు, పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు భూ కేటాయింపులతో పాటు పారిశ్రామిక పెట్టుబడులకు ఆమోదం తెలపడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

క్యాబినెట్ భేటీలో చర్చకు రానున్న ప్రధానాంశాలు, అజెండా వివరాల్లో ముఖ్యంగా.. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఈ క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం భారీ ఊరట కల్పించనుంది. రాజధాని కోసం కొత్తగా భూములిచ్చే వారికి ఎకరానికి ఏడాదికి రూ.40 వేల చొప్పున యాన్యుటీ ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. గ్రామ కంఠాల్లో భూములు కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలుస్తూ నెలకు రూ.10 వేల చొప్పున అద్దె భత్యం మంజూరు చేయనున్నారు.

కొత్త పూలింగ్ గ్రామాల పరిధిలోని రైతులకు రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ చేసే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా పలు ప్రభుత్వ, ఆధ్యాత్మిక, పారిశ్రామిక సంస్థలకు భూముల కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నారు.

స్పోర్ట్స్ సిటీ పరిధిలోని 307 ఎకరాల ఇనాం, దేవాదాయ శాఖ భూముల బదిలీ కోసం, దేవాదాయ శాఖకు రూ.159 కోట్ల పరిహారం చెల్లించేందుకు సీఆర్డీఏకి ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. ఫిషరీస్ శాఖ ఆధ్వర్యంలో అమరావతిలో ఆధునిక అక్వేరియం, కార్యాలయం నిర్మాణానికి 2 ఎకరాల భూమి కేటాయించనున్నారు.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు 7.42 ఎకరాల భూమి కేటాయింపుతో పాటు, ఈశా ఫౌండేషన్‌కు భూమితో పాటు పార్కు వినియోగ హక్కులు, దాని నిర్వహణ బాధ్యతలను అప్పగించే నిర్ణయానికి ఆమోద ముద్ర వేయనున్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII)కి 4 ఎకరాల భూమిని కేటాయిస్తూ సీఆర్డీఏ అథారిటీ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

భారీ పారిశ్రామిక పెట్టుబడులు…
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు గానూ ఇటీవల జరిగిన 19వ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ సమావేశంలో ఆమోదించిన 11 కీలక ప్రాజెక్టుల పెట్టుబడులకు క్యాబినెట్ తుది ఆమోదం తెలపనుంది. దీని ద్వారా రాష్ట్రంలోకి దాదాపు రూ.9,076 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కితే రాష్ట్ర యువతకు కొత్తగా 10,531 ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.