తహసీల్దార్ ఆఫీసుల్లో సర్టిఫికెట్లు పెండింగ్!.. రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన లక్షకుపైగా దరఖాస్తులు

- స్టాఫ్‌కు బీఎల్‌వోలుగా డ్యూటీలు
- ఫీల్డ్ వెరిఫికేషన్ చేయక ఆగుతున్న క్యాస్ట్, ఇన్‌కమ్, బర్త్ తదితర సర్టిఫికెట్లు
- స్కూళ్లు, కాలేజీ అడ్మిషన్లకు సర్టిఫికెట్ల అవసరం ఉండడంతో స్టూడెంట్లు, పేరెంట్స్ ఇబ్బందులు
హైదరాబాద్/ఆసిఫాబాద్, వెలుగు:రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల్లో కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ పూర్తిగా ఆగిపోయింది. స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు మొదలు కాగా విద్యార్థులకు కీలకమైన సర్టిఫికెట్లు అందడం లేదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలిపి ప్రస్తుతం లక్షకుపైగా దరఖాస్తులు మీసేవ కేంద్రాల ద్వారా వచ్చి తహసీల్దార్ లాగిన్లలో ఆగిపోయాయి. రెవెన్యూ సిబ్బందికి ఓటర్ల జాబితా సవరణ, బీఎల్‌వో (బూత్ లెవెల్ ఆఫీసర్) విధులు కేటాయించడంతో పాటు భూ భారతి లాంటి రెగ్యులర్ పనుల వల్ల వారు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరిపే పరిస్థితి లేకపోవడంతో దరఖాస్తులు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. ఫలితంగా అడ్మిషన్లు, స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.
దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లో ఇవ్వాల్సిన క్యాస్ట్, ఇన్‌కమ్, రెసిడెన్స్ తదితర సర్టిఫికెట్లు నెలలు గడుస్తున్నా జారీ కావడం లేదు. దీంతో మీసేవ కేంద్రాలకు వెళ్లి స్టేటస్ చెక్ చేసుకుంటున్న బాధితులకు ‘పెండింగ్ విత్ ఆర్‌ఐ’ లేదా ‘పెండింగ్ విత్ ఎమ్మార్వో’ అనే స్టేటస్ కనిపిస్తోంది. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయి నివేదికలు అందకుండా డిజిటల్ సంతకాలు చేయడం వీలుకాదని తహసీల్దార్లు చేతులెత్తేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి ఉండడంతో మీసేవ నిర్వాహకులు, దరఖాస్తుదారుల మధ్య రోజూ ఘర్షణలు జరుగుతున్నాయి.
అడ్మిషన్ల వేళ విద్యార్థుల ఆందోళన..
ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీతో పాటు ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందేందుకు తప్పనిసరిగా కొత్తగా తీసుకున్న కుల, ఆదాయ ధ్రువపత్రాలు సమర్పించాలన్న నిబంధన ఉంది. కానీ తహసీల్దార్ ఆఫీసుల్లో సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో కౌన్సిలింగ్‌లో పాల్గొనేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్టిఫికెట్లు లేవనే నెపంతో కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు సీట్లు కేటాయించకుండా కాలయాపన చేస్తున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు పనులు మానుకొని తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆఫీసులకు వెళ్లి అధికారులను అడిగితే ‘బీఎల్‌వోలు డ్యూటీల్లో ఉన్నారు, తర్వాత రండి’అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళారులను ఆశ్రయిస్తే తప్ప పనులు కావడం లేదని, అత్యవసరమైన వారు వేల రూపాయలు ఇచ్చుకోవాల్సి వస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ పరిస్థితి..
* కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మీ సేవ ద్వారా వేలసంఖ్యలో వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో తహసీల్దార్ స్థాయిలో మొత్తం 6 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్క కాగజ్‌నగర్ తహసీల్దార్ ఆఫీసులోనే అత్యధికంగా 2,252 ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నాయి.
*నిజామాబాద్ జిల్లాలో నెల రోజులుగా 6,453 మీ సేవ అప్లికేషన్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఇందులో 1,294 ఇన్‌కమ్ సర్టిఫికెట్లు, 2,800 నివాస ధ్రువీకరణ పత్రాల అప్లికేషన్లున్నాయి. వీటితో పాటు 2 వేల క్యాస్ట్, 152 ఈబీసీ, 234 ఓబీసీ దరఖాస్తులు కూడా ఉన్నాయి.
*ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు వరకు 750 వరకు దరఖాస్తు లు పెండింగ్‌లో ఉన్నాయి.
*జగిత్యాల జిల్లాలో మీ సేవ దరఖాస్తులు భారీగా పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో మొత్తం 5 వేల వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, అందులో 1,778 దరఖాస్తులు నిర్ణీత గడువు దాటిపోయాయి. ఎమ్‌ఆర్‌ఓ స్థాయిలో 1,395, ఆర్‌డీఓ స్థాయిలో 148, ఇతర దశల్లో 235 దరఖాస్తులు గడువు దాటినా పరిష్కారానికి నోచుకోలేదు.
*పెద్దపల్లి జిల్లాలో 4,433 అప్లికేషన్స్ పెండింగ్ లో ఉండగా, మరో 2,734 దరఖాస్తులు వివిధ దశల ప్రాసెస్ లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
*యాదాద్రి జిల్లాలో గడువు దాటినా జారీ చేయని సర్టిఫికెట్లు 508 వరకు ఉన్నాయి. వివిధ సర్టిఫికెట్ల కోసం మీ సేవలో కొత్తగా వచ్చిన అప్లికేషన్లు 3,800 కు చేరాయి. ఈ వారంలో ఈ పెండింగ్ అప్లికేషన్స్ అన్నింటినీ క్లియర్ చేస్తామని స్థానిక అధికారులు చెబుతున్నప్పటికీ, గడువు దాటిన ఫైళ్ల సంఖ్య పెరగడంపై దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
*నాగర్ కర్నూల్ జిల్లాలో 319 అప్లికేషన్స్ గడువు దాటి పెండింగ్‌లో ఉండగా, వారం రోజుల్లోపు మీ సేవా ద్వారా ఇవ్వాల్సిన సర్టిఫికెట్ల అప్లికేషన్స్ 1,453 వరకు ఉన్నాయి.
బీఎల్‌వో డ్యూటీలతో బిజీ..
రెవెన్యూ సిబ్బందికి అదనపు బాధ్యతలు అప్పగించడం వల్లే సర్టిఫికెట్ల జారీలో ఆలస్యం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టడంతో రెవెన్యూ సబార్డినేట్ సిబ్బందిని బూత్ లెవెల్ ఆఫీసర్లుగా (బీఎల్వోలుగా) నియమించారు. దీంతో వారంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ పనిలోనే బిజీ అవుతున్నారు. ఫలితంగా మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులపై ఫీల్డ్ వెరిఫికేషన్ చేసేందుకు సమయం దొరకడం లేదు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీకి స్థానిక విచారణ తప్పనిసరి కావడంతో సిబ్బందికి తీరిక లేక ఆ ఫైళ్లన్నీ పక్కనపడిపోయాయి.