July 9, 2026

Uttam Kumar Reddy : ఎల్‌నీనో సవాళ్లపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తం

Uttam Kumar Reddy : ఎల్‌నీనో సవాళ్లపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తం
Reading Time: 2 minutes
Uttam Kumar Reddy Elnino Farmers Alert

Uttam Kumar Reddy : రాష్ట్రంలో ఎల్‌నీనో ప్రభావం, వర్షపాత పరిస్థితులపై రాష్ట్ర సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వి.సి జానయ్యతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎల్‌నీనో సవాళ్లను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు.

జిల్లా వారీగా కార్యాచరణ.. ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన

ఎల్‌నీనో ప్రభావానికి అనుగుణంగా జిల్లా వారీగా ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వాతావరణం, వ్యవసాయం, నీటిపారుదల శాఖలు నిరంతరం సమన్వయంతో పని చేస్తూ క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు. జిల్లాల్లో వర్షపాతం, రిజర్వాయర్లలో నీటి లభ్యత ఆధారంగా రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామసభల ద్వారా రైతుల్లో ఎల్‌నీనో ప్రభావంపై చైతన్యం తీసుకురావాలని, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు తక్కువ నీటితో పండే పంటల ఎంపికపై రైతులకు స్పష్టమైన మార్గదర్శకాలు , సాంకేతిక సలహాలు అందించాలని అధికారులకు స్పష్టం చేశారు.

సాగునీటి శాస్త్రీయ నిర్వహణ.. ఎరువుల లభ్యతపై ఆదేశాలు

రాష్ట్రంలోని రిజర్వాయర్లలో ఉన్న నీటి లభ్యతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. అందుబాటులో ఉన్న సాగునీటిని వృధా కాకుండా అత్యంత శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించి పంటలకు అందిస్తామన్నారు. సాగు సీజన్‌కు అవసరమైన ఎరువులను రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని, ఎక్కడా రైతులకు ఇబ్బందులు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో పరిస్థితులను తాము ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని పేర్కొన్నారు.

వదంతులు నమ్మవద్దు.. రైతు సంక్షేమమే అత్యున్నత ప్రాధాన్యం

రైతు సంక్షేమమే తమ ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సాగు విషయాలపై సోషల్ మీడియాలో లేదా బయట వచ్చే ఎలాంటి వదంతులను, పుకార్లను రైతులు నమ్మవద్దని.. కేవలం వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు ఇచ్చే అధికారిక సూచనలనే పాటించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అడుగులోనూ రైతులకు అండగా ఉంటూ భరోసా కల్పిస్తుందని మంత్రి పునరుద్ఘాటించారు.