July 11, 2026

E20తో మైలేజ్ తగ్గడం నిజమే… కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడి…

E20తో మైలేజ్ తగ్గడం నిజమే... కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడి...
Reading Time: 2 minutes

E20తో మైలేజ్ తగ్గడం నిజమే… కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడి…

Caption of Image.
  • ఇంజన్ పనితీరు మెరుగవుతుంది..
  • ఫ్యూయల్​ ధర మాత్రం తగ్గదని వివరణ

న్యూఢిల్లీ: 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (ఈ20) తో  కొన్ని వాహనాల్లో మైలేజ్  3–-5 శాతం తగ్గే అవకాశం ఉందని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ శుక్రవారం  స్పష్టం చేసింది. అయితే, ఈ చిన్న లోపం కంటే దీంతో  లభించే హై-అక్టేన్ రేటింగ్, మెరుగైన పికప్, స్మూత్ యాక్సిలరేషన్, క్లీన్ ఇంజన్ పనితీరు,  తక్కువ కార్బన్ ఉద్గారాలు వంటి  ప్రయోజనాలే  ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. ఈ20పై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ఈ వివరాలను పంచుకుంది.  

‘‘ఈ20 ఇంధనాన్ని మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్ వంటి సంస్థల భాగస్వామ్యంతో ఎన్నో ఏళ్లు రీసెర్చ్‌ చేసిన తర్వాతనే  తీసుకొచ్చాం. 2014–15 నుంచి ఈ కార్యక్రమం ద్వారా దేశానికి రూ.1.97 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యం  ఆదా అయింది. అలాగే, 316 లక్షల టన్నుల ముడిచమురు దిగుమతులు తగ్గడమే కాకుండా, రైతుల ఖాతాల్లోకి రూ.1.66 లక్షల కోట్లు చేరాయి” అని వివరించింది.

ఈ20 ధర సాధారణ పెట్రోల్ కంటే తక్కువగా ఉండకపోవచ్చని, కానీ ఇది దేశ ఇంధన భద్రతకు కీలకమని తెలిపింది. అలాగే పంపుల వద్ద ప్యూర్ పెట్రోల్, ఈ10 , ఈ20 వంటి  వేర్వేరు గ్రేడ్లను ఉంచితే ఫ్యూయల్  డిస్ట్రిబ్యూషన్‌లో గందరగోళం నెలకొంటుందని, ఖర్చులు పెరుగుతాయని వివరించింది.

వాహనాల ఇంజన్లకు భద్రత

పాత వాహనాల ఇంజన్లు ఈ20 ఇంధనం వల్ల పాడవుతాయనే ఆందోళనలను ప్రభుత్వం కొట్టిపారేసింది. 2025-–26లో మారుతీ సుజుకీ సర్వీస్ చేసిన 2.84 కోట్ల వాహనాల్లో 1.5 కోట్ల పాత మోడళ్లు ఈ20 ధృవీకరణ లేనివి అయినప్పటికీ, వాటిలో ఇంజన్ తుప్పు పట్టడం లేదా ఫ్యూయల్ భాగాలు దెబ్బతినడం వంటి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని గణాంకాలను ఉదహరించింది. ఏఆర్ఏఐ, ఎస్ఐఏఎం, ఐఓసీఎల్ వంటి సంస్థలు కూడా ఈ ఇంధనం సురక్షితమేనని ధృవీకరించాయి.

పర్యావరణ ప్రయోజనాలు

ఈ20 ఇంధనం వాడటం వల్ల కర్బన ఉద్గారాలు సుమారు 40% తగ్గుతాయని కేంద్రం స్పష్టం చేసింది. 2014కు ముందు కేవలం 1.5 శాతానికే పరిమితమైన ఇథనాల్ బ్లెండింగ్, 2018 నాటి విధానపరమైన మార్పులతో ప్రస్తుతం 20 శాతానికి చేరుకుంది. 2022 నుంచి 2026 వరకు భారత్‌‌‌‌లో పెట్రోల్ ధరల పెరుగుదల కేవలం 5.58 శాతంగా మాత్రమే ఉందని, ఇది ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువని ప్రభుత్వం వివరించింది. 

దేశవ్యాప్తం గా లక్షకు పైగా ఉన్న పెట్రోల్ బంకుల్లో 3 రకాల ఇంధన సరఫరా వ్యవస్థలను (ఈ10, ఈ20, స్వచ్ఛమైన పెట్రోల్) నిర్వహించడం లాజిస్టిక్ పరంగా అసాధ్యమని, అందుకే తక్కువ మిశ్రమం ఉన్న ఇంధనాలను దశలవారీగా తొలగిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
 

©️ VIL Media Pvt Ltd.