Sourav Ganguly: ‘దాదా’కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ఐసీసీ.. గంగూలీ భావోద్వేగ పోస్ట్..

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ‘దాదా’ సౌరవ్ గంగూలీ తన 54వ పుట్టినరోజున ఒక అరుదైన, అత్యున్నత గౌరవాన్ని అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఆయనను ప్రతిష్టాత్మకమైన ‘హాల్ ఆఫ్ ఫేమ్’ జాబితాలోకి చేర్చింది. ఈ ఘనత సాధించిన 12వ భారతీయ క్రికెటర్‌గా, అలాగే 10వ పురుష క్రికెటర్‌గా గంగూలీ రికార్డు సృష్టించారు.
గంగూలీ భావోద్వేగం..
ఈ గౌరవం దక్కడంపై గంగూలీ హర్షం వ్యక్తం చేశారు. ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “నన్ను హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చినందుకు ఐసీసీకి, ఛైర్మన్ జై షాకు ధన్యవాదాలు. క్రికెట్ ప్రపంచంలోని గొప్ప దిగ్గజాల సరసన నిలవడం నాకు దక్కిన పెద్ద గౌరవం, గర్వకారణం” అని పేర్కొన్నారు.
గతంలో ఈ గౌరవం అందుకున్న భారతీయులు..
గంగూలీ కంటే ముందు భారత్ నుండి సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, బిషన్ సింగ్ బేడీ (వీరు ముగ్గురు 2009లో మొదటగా ఎంపికయ్యారు), సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, ఎంఎస్ ధోనిలతో పాటు మహిళా క్రికెటర్లు డయానా ఎదుల్జీ, నీతూ డేవిడ్‌లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
1992 నుండి 2007 వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఉన్న గంగూలీ, భారత్ తరఫున ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. టెస్ట్ క్రికెట్ లో.. 113 మ్యాచ్‌ల్లో 16 శతకాలతో 7,212 రన్స్ చేశారు. 32 వికెట్లు తీశారు. వన్డే క్రికెట్ లో.. 311 మ్యాచ్‌ల్లో 22 శతకాలతో 11,363 రన్స్ చేశారు. 100 వికెట్లు పడగొట్టారు.
Thank you ICC and Chairman Jay shah @JayShah for inducting me in the hall of fame .. it’s a huge honour ..One of the 10 Indians to be inducted in the hall of fame ever .. Amazing to be a part of some great names .. @bcci
— Sourav Ganguly (@SGanguly99) July 8, 2026
2000 నుండి 2005 వరకు భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన గంగూలీ, మ్యాచ్ ఫిక్సింగ్ కష్టాల్లో ఉన్న జట్టును విజయపథంలో నడిపించారు. ముఖ్యంగా విదేశాల్లో భారత్ గెలవగలదనే దూకుడును నేర్పించారు. ఆయన నేతృత్వంలోనే టీమిండియా 2002లో నాట్‌వెస్ట్ సిరీస్ గెలవడం, 2003 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరడం విశేషం. ఆటగాడిగానే కాకుండా 2019-2022 వరకు ఆయన బీసీసీఐ (BCCI) అధ్యక్షుడిగా కూడా సేవలు అందించారు.