సొరకాయ vs బీరకాయ.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? బరువు తగ్గాలనుకునేవారికి ఇది సూపర్ ఫుడ్..
పోషకాల పోలిక: ప్రతి 100 గ్రాముల సొరకాయలో కేవలం 15 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. దీనిలో 92శాతం నీటి శాతమే ఉంటుంది. విటమిన్-సి, పొటాషియం, మెగ్నీషియం, కరిగే ఫైబర్, దీనిలో పుష్కలంగా లభిస్తాయి. ఇక బీరకాయలో క్యాలరీలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అయితే దీనిలో డైటరీ ఫైబర్, విటమిన్-ఎ, ఐరన్, ఫోలేట్ వంటి సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి సొరకాయ మంచిది కాగా, కంటి చూపుకు, రక్తహీనత తగ్గడానికి అవసరమైన ఐరన్, విటమిన్-ఎ కోసం బీరకాయ ఉత్తమం.
జీర్ణక్రియకు ఏది మేలు: రెండూ జీర్ణక్రియకు మంచివే అయినప్పటికీ.. సొరకాయ చాలా తేలికగా జీర్ణమవుతుంది. అసిడిటీ, కడుపు ఉబ్బరం లేదా అనారోగ్యం నుండి కోలుకుంటున్న వారికి ఆయుర్వేదంలో సొరకాయను ఎక్కువగా సిఫార్సు చేస్తారు. ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్గా పనిచేసి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. మరోవైపు బీరకాయలో పీచు పదార్థం ఎక్కువ. దీన్ని సరిగ్గా ఉడికించకపోతే సెన్సిటివ్ కడుపు ఉన్నవారిలో గ్యాస్ లేదా అసౌకర్యం కలిగించవచ్చు. అయితే మధుమేహం ఉన్నవారిలో బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడానికి ఈ ఫైబర్ బాగా పనిచేస్తుంది.
బరువు తగ్గడం – డిటాక్స్: బరువు తగ్గాలనుకునే వారికి రెండు కూరగాయలూ అద్భుతంగా పనిచేస్తాయి. కానీ డిటాక్స్ విషయానికి వస్తే సొరకాయ జ్యూస్ సూపర్ ఫుడ్‌గా పేరు తెచ్చుకుంది. ఉదయాన్నే పరగడుపున సొరకాయ రసం తాగడం వల్ల లివర్, కిడ్నీల్లోని వ్యర్థాలు బయటకు పోతాయి. పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల ఒంట్లో వాపులు తగ్గుతాయి. బీరకాయ ఎక్కువ సేపు కడుపు నిండిన భావనను కలిగించి, ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
గుండె, మెదడు – రోగనిరోధక శక్తి: బీరకాయలో ఉండే ఐరన్, ఫోలేట్ అలసటను తగ్గించి మెదడు చురుగ్గా పనిచేసేలా చూస్తాయి. దీనిలోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. సొరకాయ శరీరానికి చలవ చేస్తుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం రక్తపోటును తగ్గించి, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి.
వంటల్లో వైవిధ్యం – రుచి: రుచి పరంగా సొరకాయ చాలా సాఫ్ట్‌గా ఉండి, ఏ మసాలానైనా త్వరగా పీల్చుకుంటుంది. సొరకాయతో కూరలు, పప్పు, సూప్స్ మాత్రమే కాకుండా కోఫ్తాలు, హల్వా వంటి స్వీట్లు, పరాటాలు కూడా చేసుకోవచ్చు. బీరకాయ కొద్దిగా తీపి, మట్టి వాసనతో కూడిన రుచిని కలిగి ఉంటుంది. ఇది త్వరగా ఉడుకుతుంది. బీరకాయ ముక్కల కూర, బీరకాయ పాలు పోసిన కూర, లేదా బీరకాయ తొక్కు పచ్చడి వంటి వంటకాలకు ఇది చాలా ఫేమస్.
ఏది బెస్ట్..?: మీ లక్ష్యం బాడీ డెటాక్స్, గుండె ఆరోగ్యం, అసిడిటీ తగ్గించుకోవడం అయితే సొరకాయను ఎంచుకోండి. అలా కాకుండా ఇమ్యూనిటీ, రక్తం పెరగడం, కంటి చూపు మెరుగుపడటం, షుగర్ కంట్రోల్ కోసం అయితే బీరకాయను మీ డైట్లో చేర్చుకోండి. ఈ రెండింటినీ మార్చి మార్చి తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది.





