July 9, 2026

Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!

Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
Reading Time: 2 minutes
Jofra Archer Ipl Pitches India Vs England Third T20 Comments

Jofra Archer: ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా మంగళవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 125 పరుగుల తేడాతో భారత్‌ను ఘోరంగా ఓడించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆర్చర్ 29 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, జోష్ టంగ్ 4 వికెట్లతో చెలరేగడంతో 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 76 పరుగులకే కుప్పకూలింది. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆర్చర్ మాట్లాడుతూ.. ఐపీఎల్‌లో భారత బ్యాటర్లను ఎదుర్కోవడానికి, ఇక్కడ బౌలింగ్ చేయడానికి ఉన్న తేడాను వివరించాడు. “ఇది ఐపీఎల్ కాదు” అనే అర్థం వచ్చేలా మాట్లాడాడు. ఐపీఎల్‌లో బ్యాటర్లకు అనుకూలంగా ఉండే ఫ్లాట్ పిచ్‌లు, చిన్న బౌండరీలపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో ముఖ్యంగా ఐపీఎల్‌లో బ్యాటింగ్‌కు అనుకూలించే వికెట్లపై బౌలింగ్ చేసిన తర్వాత.. ఇంగ్లాండ్ వాతావరణంలో బౌలింగ్ చేయడం మళ్లీ తమకు నార్మల్ అనిపిస్తోందని ఆర్చర్ వ్యాఖ్యానించాడు. “ఇక్కడికి వచ్చాక పరిస్థితులు మళ్లీ మాకు సాధారణ స్థితికి వచ్చినట్లు అనిపిస్తోంది. ఇంగ్లాండ్‌లో మంచి లెంగ్త్‌తో నేరుగా బంతులు వేయడానికి ప్రయత్నిస్తే సరిపోతుంది. కానీ ఇండియాలో పిచ్‌లు బ్యాటింగ్‌కు చాలా ఈజీగా ఉంటాయి, బౌండరీలు కూడా చాలా చిన్నవిగా ఉంటాయి. అందుకే అక్కడ బౌలర్లు చాలా చాలా జాగ్రత్తగా, ఖచ్చితత్వంతో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్‌లో మాత్రం బౌలర్లకు తప్పులు సరిదిద్దుకునే అవకాశం (Margin for error) కాస్త ఎక్కువగా ఉంటుంది” అని ఆర్చర్ అన్నాడు.

ఇంగ్లాండ్ వాతావరణానికి, ఐపీఎల్‌కు ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తిచూపుతూ.. ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్‌పై 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఏ జట్టుకైనా కష్టమేనని ఆర్చర్ అభిప్రాయపడ్డాడు. “ఐపీఎల్‌లో కొన్నిసార్లు 200 పరుగులు చేసినా గెలుస్తామన్న నమ్మకం ఉండదు. కానీ ఈ వికెట్‌పై 201 పరుగులు బోర్డుపై ఉన్నప్పుడు.. మేము పూర్తిగా ధీమాగా ఉన్నామని చెప్పలేను కానీ, దీనిని ఛేదించాలంటే మాత్రం ఎవరో ఒకరు చాలా స్పెషల్ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుందని నాకు తెలుసు. మా బౌలర్లందరూ వికెట్లు తీసి జట్టు విజయానికి సమిష్టిగా కృషి చేయడం సంతోషంగా ఉంది” అని పేర్కొన్నాడు. ఇక, ఐర్లాండ్ పర్యటనలో టీ20 సిరీస్ ఓడిపోయిన శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని యంగ్ టీమిండియా.. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోనూ 2-0తో వెనుకబడింది. ఈ మ్యాచ్‌లో ఆర్చర్, జోష్ టంగ్ ఇద్దరూ 144 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తూ ఎక్స్‌త్రా బౌన్స్‌తో భారత బ్యాటింగ్‌ను కోలుకోకుండా దెబ్బతీశారు. అయితే తమ వేగం కంటే క్రమశిక్షణతో బౌలింగ్ చేయడమే వికెట్లు తెచ్చిపెట్టిందని ఆర్చర్ అన్నాడు.