Tilak Varma: తిలక్ వర్మను ఎందుకు ఆడిస్తున్నారు.. టీమిండియా వరుస ఓటములకు ప్రధాన కారణం ఇదే..

ఇటీవల ఐర్లాండ్, ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లలో తిలక్ వర్మ ఫామ్ పూర్తిగా దెబ్బతింది. అతని బ్యాట్ నుండి పరుగులు రాకపోవడమే కాకుండా, స్ట్రైక్ రేట్ కూడా బాగా పడిపోయింది. ఐర్లాండ్ సిరీస్ లో భాగంగా 2 మ్యాచ్‌ల్లో కేవలం 74 పరుగులు మాత్రమే చేశాడు. మొదటి మ్యాచ్‌లో 19 (21 బంతుల్లో), రెండో మ్యాచ్‌లో 55 (46 బంతుల్లో) పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్ సిరీస్ లో భాగంగా.. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌లలో (3 ఇన్నింగ్స్‌లలో) కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు. ఒక మ్యాచ్ వర్షం వల్ల బ్యాటింగ్ రాలేదు. మిగిలిన ఇన్నింగ్స్‌లలో 13, 24, 11 పరుగులు చేసి తక్కువ స్కోరుకే అవుటయ్యాడు.
లోయర్ ఆర్డర్ తిలక్‌కు ఎందుకు సెట్ అవ్వట్లేదు?
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో మేనేజ్‌మెంట్ తిలక్ వర్మను ఫినిషర్‌గా 6 లేదా 7 నంబర్లలో బ్యాటింగ్‌కు పంపుతోంది. కానీ, కెరీర్‌లో ఎక్కువ భాగం టాప్ ఆర్డర్‌లో ఆడిన తిలక్, ఈ స్థానాల్లో రాణించలేకపోతున్నాడు. దీనివల్ల అతని ప్రతిభ వృథా అవ్వడమే కాకుండా జట్టుకు కూడా నష్టం జరుగుతోంది. తిలక్ వర్మ టి20 అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తం 55 మ్యాచ్‌లలో 42 సగటుతో 1514 పరుగులు చేశాడు. అతని పొజిషన్ల వారీగా రికార్డులు ఇలా ఉన్నాయి.
నంబర్ 3లో.. 20 ఇన్నింగ్స్‌లలో 46.35 సగటు, 151 స్ట్రైక్ రేట్‌తో 649 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు (సౌతాఫ్రికాపై బ్యాక్-టు-బ్యాక్), 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. నంబర్ 4లో.. 14 ఇన్నింగ్స్‌లలో 54.44 సగటుతో 490 పరుగులు సాధించాడు. నంబర్ 5, 6 లేదా 7 (లోయర్ ఆర్డర్)లో.. ఇక్కడ అతని ఫామ్ బాగా పడిపోయింది. 18 ఇన్నింగ్స్‌లలో కేవలం 29 సగటుతో 376 పరుగులు మాత్రమే చేయగలిగాడు. టాప్ ఆర్డర్‌లో అద్భుతమైన రికార్డులు ఉన్న ఆటగాడిని బలవంతంగా లోయర్ ఆర్డర్‌లో ఆడించడం వల్ల జట్టుకు గానీ, ఆటగాడికి గానీ ఎలాంటి ప్రయోజనం కలగడం లేదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.