రంగారెడ్డి ఔట్.. క్వాలిఫయర్-2 టికెట్ కన్ఫర్మ్ చేసుకున్న కరీంనగర్ డైమండ్స్

TG20 League 2026: తెలంగాణ ప్రీమియర్ (టిజీ20) లీగ్-2026లో భాగంగా ఉప్పల్ వేదికగా రంగారెడ్డి రైజర్స్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కరీంనగర్ డైమండ్స్ జట్టు 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో కరీంనగర్ జట్టు క్వాలిఫైయర్-2కి అర్హత సాధించింది. ఇక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్న కరీంనగర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 5 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. కరీంనగర్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ భారీ సెంచరీతో జట్టును ముందుకు నడిపించాడు. అతడు కేవలం 61 బంతుల్లోనే 11 ఫోర్లు, 10 సిక్సర్లతో 137 రన్స్ చేశాడు. ఈ టీజీ20 లీగ్‌లో తన్మయ్‌కి ఇది మూడో సెంచరీ కావడం విశేషం.
రాణించిన సింహా.. రంగారెడ్డి బౌలింగ్ విఫలం:
తన్మయ్‌తో పాటు వైస్ కెప్టెన్ సింహా హాఫ్ సెంచరీ (50 పరుగులు)తో రాణించాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు కేవలం 69 బంతుల్లోనే 139 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా రంగారెడ్డి బౌలర్లలో అర్బజ్ కరీముద్దీన్ రెండు వికెట్లు పడగొట్టగా.. అరుణ్ కుమార్, కెప్టెన్ వినయ్ త్యాగరాజన్, సుకేత్, నితిన్ సాయి యాదవ్ తలో ఒక వికెట్ తీసుకున్నారు.
చేతులెత్తేసిన రంగారెడ్డి బ్యాటర్లు:
239 పరుగుల భారీ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన రంగారెడ్డి రైజర్స్ జట్టు కేవలం 16.3 ఓవర్లలో 163 పరుగులకే కుప్పకూలింది. అయితే కరీంనగర్ స్పిన్నర్ అమిత్ శర్మ తన అద్భుత బౌలింగ్‌తో రంగారెడ్డి బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బకొట్టాడు. అతను 3.3 ఓవర్లలో కేవలం 16 రన్స్ మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసుకుని కరీంనగర్‌కు విజయాన్ని అందించాడు. అమిత్‌తో పాటు రూపేష్ వర్మ కూడా 2 వికెట్లు సొంతం చేసుకున్నాడు.
అయితే రంగారెడ్డి రైజర్స్ జట్టు బ్యాటర్లలో కెప్టెన్ వినయ్ త్యాగరాజన్ (33 బంతుల్లో 63), నితిన్ సాయి యాదవ్ (50) హాఫ్ సెంచరీలతో ఒంటరి పోరాటం చేసినప్పటికీ జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో రంగారెడ్డికి ఈ ఘోర ఓటమి తప్పలేదు. ఈ పరాజయంతో రంగారెడ్డి ఇంటికి వెళ్లిపోయింది.