July 8, 2026

Harish Rao: మెచ్చుకోవాల్సింది పోయి.. ఏంటి ఈ చిల్లర రాజకీయాలు.?

Harish Rao: మెచ్చుకోవాల్సింది పోయి.. ఏంటి ఈ చిల్లర రాజకీయాలు.?
Reading Time: 2 minutes
Harish Rao Slams Revanth Reddy Government Over Kaleshwaram Project Irrigation Issues

Harish Rao: తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్, తుమ్మిడిహట్టి, నీటి పారుదల ప్రాజెక్టులు, రైతులకు సాగునీటి అంశాలపై ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి ఇరిగేషన్‌పై కనీస అవగాహన కూడా లేదని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

గోదావరిలో ప్రస్తుతం లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నా ప్రభుత్వం కన్నెపల్లి పంప్ హౌస్‌లో మోటార్లు ఆన్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హరీష్ రావు అన్నారు. ప్రస్తుతం మేడిగడ్డ వద్ద తగినంత నీటి లభ్యత ఉందని, కన్నెపల్లి పంప్ హౌస్‌ను ప్రారంభిస్తే రోజుకు మూడు టీఎంసీల వరకు నీటిని ఎల్లంపల్లికి తరలించే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు.

అవకాశం ఇవ్వండి.. చేసి చూపిస్తా:

తనకు కేవలం మూడు నెలల పాటు నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తే ఎల్లంపల్లికి నీళ్లు ఎలా తరలించాలో చేసి చూపిస్తానని హరీష్ రావు సవాల్ విసిరారు. ఒకవేళ తాను చెప్పినట్లు చేయలేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనితీరును తిరిగి గాడిలో పెట్టే సామర్థ్యం బీఆర్ఎస్‌కే ఉందని అన్నారు.

ప్రభుత్వంపై విమర్శలు:

కాళేశ్వరం ప్రాజెక్టులో 240 టీఎంసీల నీటి వినియోగానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్ని అనుమతులు తీసుకువచ్చిందని హరీశ్ రావు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్‌లో 85 పిల్లర్లలో కేవలం ఒక పిల్లర్ మాత్రమే కుంగిపోయిందని, దానిని కారణంగా చూపించి మొత్తం ప్రాజెక్టును నిలిపివేయడం సరికాదన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్‌ను ఏజెన్సీ 45 రోజుల్లోనే అదనపు ప్రభుత్వ వ్యయం లేకుండా మరమ్మతు చేసిందని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, సాగునీటి అంశాలపై అసెంబ్లీలో చర్చ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ రావాల్సిన అవసరం లేదని, బీఆర్ఎస్ తరఫున తామే చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రభుత్వం చెప్పే ప్రతి అంశంపై వాస్తవాలతో సమాధానం ఇస్తామని పేర్కొన్నారు.

తుమ్మిడిహట్టి అనుమతులపై ప్రశ్నలు:

తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు అవసరమైన అనుమతుల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం రెండున్నరేళ్లలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒక్కసారైనా చర్చలు జరిపిందా అని హరీశ్ రావు ప్రశ్నించారు. తుమ్మిడిహట్టికి అనుమతి తీసుకొచ్చామని ప్రభుత్వం నిరూపిస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు. మరోవైపు ప్రెస్‌మీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపైనా హరీష్ రావు స్పందించారు. తన ఎత్తు గురించి వ్యాఖ్యానించడం సరైన రాజకీయ సంస్కృతి కాదన్నారు. కేసీఆర్‌ను గౌరవించే విజ్ఞత ముఖ్యమంత్రికి లేదని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతకు కేటాయించిన గదిని కూడా ప్రభుత్వం తొలగించిందని విమర్శించారు. అలాగే ఉద్యమకారులు, నిరుద్యోగులు, గన్‌పార్క్ అంశాలపై కూడా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని పలు ప్రశ్నలు సంధించారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి రాజకీయ విమర్శలకే ప్రభుత్వం పరిమితమైందని హరీష్ రావు ఆరోపించారు.