Post Office: కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. పోస్టాఫీసుల ద్వారా ప్రతీ నెలా రూ.9 వేలు.. ఎలా అంటే..?

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం కోసం ఎదురుచూస్తున్నారా..? ప్రతీ నెలా స్ధిరమైన ఆదాయం కావాలా? మీరు పొదుపు చేసే డబ్బులు సురక్షితంగా, భద్రంగా ఉండాలనుకుంటున్నారా..? అయితే మీకు పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం(MIS) బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వ హామీతో కూడిన ఈ పథకం మీకు నెలవారీ ఆదాయాన్ని అందిస్తుంది. అలాగే మీ జీవిత భాగస్వామితో కలిసి ఉమ్మడిగా కూడా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. అసలు ఈ పథకంలో ఎలా పెట్టుబడి పెట్టాలి? ఎంత వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఈ పథకంలో ఎంత వడ్డీ లభిస్తుంది..?
పోస్ట్ ఆఫీసుల్లో అనేక పొదుపు పథకాలు ఉన్నాయి. వాటిల్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కీముల్లో నెలవారీ ఆదాయ పథకం ఒకటిగా చెప్పవచ్చు ప్రస్తుతం ఈ పథకం వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. ఐదు సంవత్సరాల వరకు ఇందులో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెచ్యూర్ అవుతుంది. 18 ఏళ్ల వయస్సు దాటినవారు ఎవరైనా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. రూ.వెయ్యి నుంచి ఎంతైనా ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. వ్యక్తిగత అకౌంట్ లేదా ఉమ్మడి ఖాతాగా ఇందులో డబ్బులు పొదుప చేయవచ్చు. ఒక ఉమ్మడి ఖాతాలో గరిష్టంగా ముగ్గురు వయోజన ఖాతాదారులు ఉండవచ్చు.
ప్రతి నెలా ఎంత ఆదాయం వస్తుంది..?
మెచ్యూరిటీ తర్వాత ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు కావాలని కోరుకునేవారికి ఈ పథకం సరైనది కాదు. ప్రతీ నెలా ఆదాయం కావాలనుకునేవారికి ఇది మంచి పథకం. పెట్టుబడి పెట్టిన మరుసటి నెల నుండి వడ్డీ ప్రారంభమవుతుంది. ప్రతి నెలా మీకు దీనిని చెల్లిస్తారు. మీరు, మీ జీవిత భాగస్వామి ఒక జాయింట్ అకౌంట్ తెరిచి గరిష్టంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టారనుకుందాం. ప్రస్తుతం ఈ పథకానికి కేంద్రం 7.4 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. దీని ప్రకారం ప్రతి నెలా రూ. 9,250 పొందవచ్చు. రిటైర్మెంట్ వయస్సు తర్వాత నెలవారీ ఆదాయం కావాలనుకునేవారికి ఇది బెస్ట్ స్కీమ్‌గా చెప్పవచ్చు.
జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే..
ఈ పథకంలో ఒక వ్యక్తి కనీసం రూ.వెయ్యి నుంచి రూ. 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇక జాయింట్ అకౌంట్‌లో గరిష్టంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఉమ్మడి ఖాతాలో ప్రతి ఖాతాదారునికి పెట్టుబడిలోనూ, దానిపై వచ్చే వడ్డీలోనూ సమాన వాటా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ మీ సొమ్ముకు ఉంటుంది. దీంతో మీరు డబ్బులు కోల్పోయే అవకాశం ఉండదు.