July 11, 2026

Akhil Akkineni Lenin Review : అఖిల్ అక్కినేని లెనిన్ రివ్యూ

Akhil Akkineni Lenin Review : అఖిల్ అక్కినేని  లెనిన్ రివ్యూ
Reading Time: 2 minutes
Akhil Akkineni Lenin Movie Review And Rating

అక్కినేని ఫ్యామిలీ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన అఖిల్, తన మొదటి సినిమా ‘అఖిల్’ నుంచే సరైన హిట్ కోసం పాకులాడుతున్నాడు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ పర్వాలేదు అనిపించుకున్న తర్వాత వచ్చిన ‘ఏజెంట్’, అతని కెరియర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. కొంత గ్యాప్ తీసుకుని ఆయన ‘లెనిన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మురళీకృష్ణ అపూర్వ డైరెక్షన్లో, నాగార్జున – నాగవంశీ నిర్మాతలుగా రూపొందించిన ఈ సినిమా, ఎట్టకేలకు కొన్ని వాయిదాల అనంతరం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

లెనిన్ కథ:
లెనిన్ (అక్కినేని అఖిల్) ఓ అనాథ. చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామానికి చేరుకున్న అతను, ఓ జాతరలో ఆ ఊరి పెద్ద కుటుంబానికి దగ్గరవుతాడు. ఆ ఊరు మొత్తానికి తలలో నాలుకలా వ్యవహరిస్తూ అందరికీ ఆప్తుడు అవుతాడు. ఈ క్రమంలోనే ఒక జాతర సందర్భంగా అతను భారతి (భాగ్యశ్రీ బోర్సే) తో ప్రేమలో పడతాడు. అయితే, లెనిన్‌ని పెంచి పెద్ద చేసిన కుటుంబానికి చెందిన వసంత్, భారతిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కానీ, భారతి తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను లెనిన్‌ని ఇష్టపడుతున్నానని చెబుతుంది. దీంతో వసంత్ దగ్గరుండి లెనిన్, భారతి ఇద్దరికీ పెళ్లి చేస్తాడు. అయితే, ఆ తర్వాత ఏం జరిగింది? లెనిన్ ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? ఇందులో భారతి పాత్ర ఏమిటి? ఎతిరాజులు (శివాజీ) పాత్ర ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:
అక్కినేని అఖిల్ నిజానికి చాలా కాలం నుంచి ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన సుదీర్ఘమైన గ్యాప్ తీసుకుని, తన తండ్రి నాగార్జున ఫైనల్ చేసిన ‘లెనిన్’ కథను పట్టాలెక్కించాడు. అయితే, ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచే ఎన్నో లీకులు సినిమాను ఇబ్బంది పెట్టాయి. సినిమా మేకర్స్ కీలకంగా భావించిన చివరి ఎపిసోడ్స్ కొన్ని లీక్ కావడంతో, అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది.
సినిమా ప్రారంభమైనప్పటి నుంచే సినిమాలో కీలకమైన ఎపిసోడ్స్‌గా భావించిన కొన్ని సీన్లు ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలానే ఉన్నాయి. ముఖ్యంగా అనాథగా ఓ కుర్రాడు ఓ గ్రామానికి రావడం, అక్కడ వారందరితో కలిసిపోవడం బాగుంది. అయితే కొద్దిసేపటికి, పెరిగి పెద్దవాడైన అతను జైలు నుంచి బయటకు రావడం, ఆ తర్వాత అతని క్రేజ్ చూస్తూ జైలర్ అండ్ టీమ్ వెనుక పడటం లాంటి ఎలివేషన్స్ కొంత వర్కౌట్ అయ్యాయి.

ఇక ఆ తర్వాత కథ ఎందుకో రొటీన్ ఫార్మాట్‌లో సాగుతున్న ఫీలింగ్ కలిగించినా, కథను ఊహించలేకుండా ముందుకు నడిపించడంలో దర్శకుడు కొంతవరకు సక్సెస్ అయ్యాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కొత్త కథ అని చెప్పలేం. ఎప్పటినుంచో మనం చూస్తున్న తెలుగు సినిమాల్లోని కథలానే అనిపిస్తుంది. కానీ, రాసుకున్న కొన్ని ట్విస్టులు మాత్రం ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా రాసుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కాకపోతే, రొటీన్ ఫీలింగ్ కలగడం కొంత ఇబ్బందికర అంశం.

ఇక సెకండ్ హాఫ్ అంతా కాసేపటికి ఒకసారి వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. దారుణం ఏమిటంటే, సోషల్ మీడియాలో చాలావరకు ప్రచారం జరిగిన ట్విస్టులు యథాతథంగా సినిమాలో ఉండటమే. ఇక ఈ ట్విస్టులను బయటకు రాకుండా చేసుకోవడంలో సినిమా టీమ్స్ ఎందుకు విఫలమవుతున్నాయో అర్థం కావడం లేదు. మొన్న ‘పెద్ది’, ఇప్పుడు ‘లెనిన్’.. ఈ రెండు సినిమాలలో షాక్ ఫ్యాక్టర్స్ అని మేకర్స్ భావించినవి ఎప్పుడో సోషల్ మీడియాలో వైరల్ అయిపోవడం సినిమాలకు కాస్త ఇబ్బందికర అంశంగానే పరిగణించొచ్చు. ఓవరాల్‌గా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కన్నా, మాస్ ఎలిమెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేసే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే, అఖిల్ అక్కినేని లెనిన్ పాత్రలో పూర్తిగా లీనమైపోయి నటించాడు. అయితే, అతని మేకోవర్ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. భాగ్యశ్రీ బోర్సేకి మంచి పాత్ర పడింది. కేవలం అందమే కాదు, అభినయంతోనూ ఆమె ఆకట్టుకునే ఛాన్స్ దొరికింది. ఇక వసంత్ పాత్రధారి కొత్తగా కనిపించినా, తెలుగు స్క్రీన్ మీద మంచి స్కోప్ ఉన్న నటుడిలానే కనిపించాడు. బ్రహ్మాజీ, శత్రు, శివాజీ, ఈశ్వరి రావు వంటి వాళ్లు తమ అనుభవంతో స్క్రీన్ మీద చాలా న్యాచురల్‌గా నటించారు.

ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది, కొన్ని షాట్స్ చాలా బాగున్నాయి. నేపథ్య సంగీతం విషయానికి వస్తే సినిమాకి అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కాకపోతే పాటలు ఎందుకో పంటి కింద రాయిలా అనిపిస్తాయి. నిడివి విషయంలో కూడా ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ వరకు అసలు ఏం జరగబోతోందా అనే అంచనాలు పెంచుతూ వెళ్లి, సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ ఫీలింగ్ కలిగిస్తుంది. కానీ, ఎంగేజ్ చేసే ట్విస్టులు కొంతవరకు సినిమాను సేవ్ అయ్యేలా చేశాయి.

ఫైనల్లీ: లెనిన్.. మాస్ ఎంటర్‌టైనర్ విత్ ఎంగేజింగ్ ట్విస్ట్స్