July 8, 2026

Alcohol: రోజూ కొద్దిగా తాగితే గుండెకు మంచిదా? కొత్త అధ్యయనంలో తేలింది ఇదే..

Alcohol: రోజూ కొద్దిగా తాగితే గుండెకు మంచిదా? కొత్త అధ్యయనంలో తేలింది ఇదే..
Reading Time: 2 minutes
Alcohol: రోజూ కొద్దిగా తాగితే గుండెకు మంచిదా? కొత్త అధ్యయనంలో తేలింది ఇదే..

చాలా మంది రోజూ కొద్దిపాటి మద్యం తాగితే ఆరోగ్యానికి, ముఖ్యంగా గుండెకు మంచిదని నమ్ముతుంటారు. సోషల్ డ్రింకింగ్ పేరుతో లేదా ఒత్తిడి తగ్గించుకోవడానికి అనే సాకుతో ఒక గ్లాస్ ఆల్కహాల్ తీసుకునే అలవాటు చాలా మందికి ఉంది. అయితే, ఈ నమ్మకానికి పూర్తి విరుద్ధంగా ఒక తాజా అంతర్జాతీయ అధ్యయనం కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం.. కొద్దిపాటి మద్యం తీసుకుంటే గుండె ఆరోగ్యానికి మంచిదన్న ప్రచారంలో వాస్తవం లేదని తేలింది.  రోజూ కేవలం ఒక చిన్న డ్రింక్ మాత్రమే తీసుకున్నా కూడా రక్తపోటు (బీపీ) పెరిగే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యల ముప్పు అధికమవుతుందని ఈ అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ పరిశోధన వివరాలు అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు చెందిన హైపర్‌టెన్షన్ జర్నల్‌లో ప్రచురితం చేశారు. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా దేశాలకు చెందిన 19,548 మందికి పైగా వ్యక్తుల ఆరోగ్య సమాచారాన్ని అనేక సంవత్సరాల పాటు విశ్లేషించి ఈ అధ్యయనం నిర్వహించారు.

అధ్యయనంలో తేలిన ముఖ్యమైన విషయాలు

1. మద్యం ఎక్కువైతే బీపీ కూడా ఎక్కువే..

మద్యం సేవించే మోతాదు పెరిగే కొద్దీ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ (పై సంఖ్య) కూడా క్రమంగా పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

2. తక్కువ మోతాదులో తాగినా ప్రమాదమే..

రోజుకు ఒక చిన్న డ్రింక్ మాత్రమే తీసుకునే వారిలో కూడా రక్తపోటు క్రమంగా పెరుగుతుందని అధ్యయనం వెల్లడించింది. ఈ పెరుగుదల చిన్నదిగా కనిపించినప్పటికీ.. ఈ అలవాటు కొన్ని సంవత్సరాల పాటు కొనసాగితే గుండె, రక్తనాళాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

3. పురుషులు, మహిళల్లో ప్రభావం వేర్వేరు..

పురుషుల్లో సిస్టోలిక్ బీపీతో పాటు డయాస్టోలిక్ బీపీ కూడా పెరిగినట్లు గుర్తించారు. మహిళల్లో డయాస్టోలిక్ బీపీ పెరుగుదల అంత స్పష్టంగా కనిపించకపోయినా, మద్యం వల్ల అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది అధ్యయనం పేర్కొంది.

మద్యం కొద్దిగా తాగితే లాభం అనే అపోహకు చెక్

ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ మోడెనా అండ్ రెజ్జియో ఎమిలియా ప్రొఫెసర్ మార్కో విన్సెటి మాట్లాడుతూ, తక్కువ మోతాదులో మద్యం తీసుకున్నా కూడా రక్తపోటు పెరుగుతుందని తమ పరిశోధనలో తేలిందన్నారు. అసలు మద్యం తాగని వారితో పోలిస్తే, కొద్దిగా తాగే వారికి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కనిపించలేదని ఆయన వెల్లడించారు. అందువల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మద్యపానాన్ని పూర్తిగా మానేయడమే ఉత్తమ మార్గమని సూచించారు.

బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ప్రకారం, సాధారణంగా 140/90 mmHg లేదా అంతకంటే ఎక్కువ రక్తపోటు ఉంటే హై బీపీగా పరిగణిస్తారు. హై బీపీ ఎక్కువకాలం కొనసాగితే గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది.

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే…

  • మద్యపానాన్ని వీలైనంత వరకు పూర్తిగా మానేయాలి.
  • ధూమపానానికి దూరంగా ఉండాలి
  • రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి
  • పండ్లు, కూరగాయలు, తక్కువ ఉప్పు ఉన్న సమతుల ఆహారం  తీసుకోవాలి
  • శరీర బరువు, కొలెస్ట్రాల్, రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి
  • మధుమేహం లేదా బీపీ ఉన్నవారు వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి

కార్డియాలజిస్ట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమం తప్పని వ్యాయామం, సమతుల ఆహారం, మద్యపానం-ధూమపానం నివారణ వంటి అలవాట్లు గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.

Also Read: ఉదయం అలసటగా ఉంటోందా..? ఇలా చేస్తే రోజంతా ఫుల్ ఎనర్జీ!

Disclaimer: ఈ కథనం అంతర్జాతీయంగా ప్రచురితమైన అధ్యయనం ఆధారంగా సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీకు రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడిని నేరుగా సంప్రదించండి.