July 8, 2026

Mamata Banerjee: ర్యాలీలో కార్యకర్త చెంపచెళ్లు మనిపించిన మమత.. వీడియో వైరల్

Mamata Banerjee: ర్యాలీలో కార్యకర్త చెంపచెళ్లు మనిపించిన మమత.. వీడియో వైరల్
Reading Time: 2 minutes
Mamata Banerjee Viral Video Tmc Worker Slap Kolkata Rally Chaos

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహనం కోల్పోయారు. కోల్‌కతాలో నిర్వహించిన తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి, యువజన విభాగాల ర్యాలీ సందర్భంగా జరిగిన గందరగోళంలో మమతా బెనర్జీ పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై టీఎంసీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

బారుయిపూర్‌లో ఓ మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా టీఎంసీ విద్యార్థి, యువజన విభాగాలు బుధవారం కోల్‌కతాలో ర్యాలీ నిర్వహించాయి. కలకత్తా హైకోర్టు అనుమతితో బాలిగంజ్ ఫారి నుంచి హజ్రా వరకు ఈ ర్యాలీ సాగింది. ర్యాలీ ముగిసిన అనంతరం అక్కడ ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అందులో గాయపడిన పలువురు టీఎంసీ కార్యకర్తలను, మహిళా కార్యకర్తలను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించే సమయంలో దారి కల్పించేందుకు మమతా బెనర్జీ స్వయంగా ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ సమయంలో ఆమె చుట్టూ భద్రతా సిబ్బంది, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరడంతో తోపులాట చోటుచేసుకుంది.

వైరల్ అవుతున్న వీడియోలో మమతా బెనర్జీ తనకు అత్యంత సమీపంలో నిలబడి ఉన్న వ్యక్తి వైపు చేయి ఎత్తినట్లు కనిపిస్తోంది. అనంతరం ఆ వ్యక్తిని అక్కడి నుంచి భద్రతా సిబ్బంది పక్కకు తీసుకెళ్లగా.. మమత ముందుకు నడుచుకుంటూ వెళ్లిపోయారు. అంబులెన్స్‌కు దారి కల్పించే క్రమంలో ఏర్పడిన గందరగోళంలో అనుకోకుండా ఈ ఘటన జరిగి ఉండవచ్చని సమాచారం.

అయితే వైరల్ అవుతున్న వీడియో ప్రామాణికతను స్వతంత్రంగా నిర్ధారించడం సాధ్యం కాలేదు. అలాగే మమతా బెనర్జీ ఉద్దేశపూర్వకంగానే కార్యకర్తను కొట్టారా? లేక గందరగోళంలో అనుకోకుండా జరిగిందా? అనే విషయంపై కూడా అధికారిక స్పష్టత రాలేదు. టీఎంసీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.