SIP పెట్టుబడుల జోరు.. విదేశీ పెట్టుబడిదారులను అధిగమించిన మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు

దేశీయ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఒక చారిత్రాత్మక మలుపు నమోదైంది. ఎన్నో సంవత్సరాలుగా మన స్టాక్ మార్కెట్లపై ఆధిపత్యం చెలాయించిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల కంటే ఇప్పుడు దేశీయ మ్యూచువల్ ఫండ్ల నిర్వహణలోని మొత్తం ఆస్తులు మొదటిసారిగా ఎక్కువగా నమోదయ్యాయి. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ లెక్కల ప్రకారం మ్యూచువల్ ఫండ్ల మొత్తం ఆస్తులు రూ.76 లక్షల 41వేల కోట్లకు చేరుకోగా.. ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్(FPI) ఆస్తులు రూ.76లక్షల 22వేల కోట్లుగా నమోదయ్యాయి. ప్రతి నెలా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP)ల ద్వారా రూ.30వేల కోట్లకు పైగా వస్తున్న నిరంతర పెట్టుబడులే దీనికి ప్రధాన కారణంగా మారింది.
అయితే ఈ విజయంతోనే మ్యూచువల్ ఫండ్స్ అన్ని విభాగాల్లో FPIలను అధిగమించాయని భావించడం సరైంది కాదు. ఈక్విటీ మార్కెట్లో మాత్రం ఇప్పటికీ విదేశీ పెట్టుబడిదారుల ఆధిపత్యం కొనసాగుతోంది. ప్రస్తుతం FPIల ఈక్విటీ హోల్డింగ్స్ విలువ రూ.68లక్షల 65వేల కోట్లు ఉండగా, మ్యూచువల్ ఫండ్ల ఈక్విటీ పెట్టుబడులు రూ.54 లక్షల 50వేల కోట్లుగా ఉన్నాయి. గత 6 నెలల్లో అధిక విలువలతో ఉన్న మార్కెట్, ఆశించిన స్థాయిలో లాభాలు లేకపోవడం, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా ముడిచమురు ధరలు పెరగడం వంటి అంశాల ప్రభావంతో విదేశీ పెట్టుబడిదారులు దాదాపు 28 బిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీ పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్లిపోయారు.
మ్యూచువల్ ఫండ్ల వృద్ధికి ఈక్విటీతో పాటు డెట్ ఫండ్లు, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లు(ETFలు) కూడా బలమైన సపోర్ట్ అందిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెండు విభాగాల్లో మ్యూచువల్ ఫండ్ల ఆస్తులు రూ.21 లక్షల 91వేల కోట్లకు చేరుకోగా, FPIల డెట్ పెట్టుబడులు కేవలం రూ.7లక్షల 58వేల కోట్లుగా ఉన్నాయి. స్థిరమైన రాబడులు, తక్కువ రిస్క్, మల్టీ-ఆసెట్ పెట్టుబడులపై పెరుగుతున్న ఆసక్తి కారణంగా చిన్న పెట్టుబడిదారులు కూడా డెట్, ETFల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది దేశీయ ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్‌లో భారీ మార్పును సూచిస్తోంది.
దేశీయ పెట్టుబడిదారుల విశ్వాసం, SIPల ద్వారా వస్తున్న నిరంతర నిధుల ప్రవాహం, ఆర్థిక అవగాహన పెరగడం వల్ల భారత మూలధన మార్కెట్ల నిర్మాణంలో పర్మనెంట్ మార్పు చోటుచేసుకుంటోంది. ప్రస్తుతం ఈక్విటీల్లో FPIలకు సుమారు రూ.14 లక్షల కోట్ల ఆధిక్యం ఉన్నప్పటికీ.. ఇదంతా గత రెండు నుంచి మూడు దశాబ్దాలుగా జరిగిన భారీ పెట్టుబడుల ఫలితమే. మరోవైపు మ్యూచువల్ ఫండ్ల వేగవంతమైన వృద్ధి గత 5 నుంచి 7 సంవత్సరాల్లోనే కనిపిస్తోంది. ఇదే ఊపు కొనసాగితే రాబోయే కొన్నేళ్లలో ఈక్విటీ కేటగిరీలోనూ దేశీయ మ్యూచువల్ ఫండ్స్ విదేశీ పెట్టుబడిదారులకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.