KTR : కాంగ్రెస్ పని అయిపోయింది.. సర్వేల్లో బీఆర్‌ఎస్‌కు 78 సీట్లు ఖాయం

KTR : తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ పతనం దాదాపు ఖాయమైపోయిందని, రాష్ట్రంలో ఆ పార్టీ పని ఇక అయిపోయినట్లేనని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ జిల్లా పార్టీ నేతలతో జరిగిన ముఖ్యమైన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సగం పదవీ కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే తన పరిపాలన, నాయకత్వంపై ఒక విస్తృతమైన సొంత సర్వే చేయించుకున్నారని కేటీఆర్ వెల్లడించారు. ఆ సర్వేలో ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత చాలా స్పష్టంగా వ్యక్తమైందని ఆయన పేర్కొన్నారు.
సర్వేల ఫలితాలు.. బీఆర్‌ఎస్ ప్రభంజనం
ఇదే సమావేశంలో పలు సర్వేల వివరాలను కేటీఆర్ ప్రస్తావించారు. ఆ వివరాలు ప్రకారం.. ముఖ్యమంత్రి చేయించుకున్న సొంత సర్వే ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారత రాష్ట్ర సమితి సుమారు 78 సీట్లను కైవసం చేసుకుని అత్యంత సులభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేలిందన్నారు. కేవలం సీఎం సొంత సర్వేలోనే కాకుండా.. రెండు ప్రముఖ మీడియా సంస్థలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ విభాగాలు క్షేత్రస్థాయిలో చేసిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఇదే పచ్చి నిజం వ్యక్తమైందని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పాలన కుంటుపడిందని, మరోసారి ప్రజలంతా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని బలంగా కోరుకుంటున్నారని అన్ని సర్వే నివేదికలు తేల్చిచెప్పాయని కేటీఆర్ వివరించారు.
సర్వేల భయంతోనే సీఎం అడ్డగోలు మాటలు
సగం పరిపాలనా కాలం ముగిసేసరికే ప్రజలు కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. సొంత సర్వేతో పాటు మిగతా అన్ని నివేదికల్లోనూ వ్యక్తమైన ఈ ఊహించని ప్రజా వ్యతిరేకతను చూసి తట్టుకోలేకనే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత వారం రోజులుగా తీవ్ర నిరాశతో, అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పతనాన్ని ఆపడం ఎవరి వల్లా కాదని ఆయన జోస్యం చెప్పారు.