Reading Time: < 1 minute

ఉగ్రవాద శిబిరాల్లో పేలుళ్లు ప్రపంచవ్యాప్తంగా వినిపించినయ్: ఆస్ట్రేలియా గడ్డపై మోడీ ఆపరేషన్ సింధూర్ ప్రస్తావన

Caption of Image.

మెల్ బోర్న్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మోడీ గురువారం (జులై 9) మెల్ బోర్న్‎లో ప్రవాస భారతీయులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. రోజురోజుకు పెరుగుతోన్న భారతదేశ సైనిక బలానికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనమని పేర్కొన్నారు. భారత స్వదేశీ రక్షణ సామర్థ్యాలు ప్రపంచ గుర్తింపును పొందాయని అన్నారు. 

పహల్గామ్ ఉగ్రదాడికి కౌంటర్‎గా ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూర్‎లో భాగంగా ఉగ్రవాద శిబిరాలలో జరిగిన పేలుళ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సత్తా ఏంటో ప్రపంచానికి అర్థమైందన్నారు. ఉగ్రవాదానికి భారత్ గట్టిగా బదలిస్తుందని ఆపరేషన్ సింధూర్ స్పష్టమైన సందేశం ఇచ్చిందని పేర్కొన్నారు. 

21వ శతాబ్దపు భారతదేశం తన 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల ద్వారా అభివృద్ధి చెందిన దేశంగా స్థిరంగా ముందుకు సాగుతోందని అన్నారు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో భారతదేశంలో తయారైన ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విస్తృత ఆమోదం, గుర్తింపు పొందుతున్నాయని తెలిపారు. 

ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని.. త్వరలోనే ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఇండియా నిలుస్తోందని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఇండియా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద 5G మార్కెట్‌గా ఆవిర్భవించిందని చెప్పారు. 6G సాంకేతికతను అభివృద్ధి చేయడానికి కూడా వేగంగా కృషి చేస్తోందని స్పష్టం చేశారు.

 

©️ VIL Media Pvt Ltd.