మహారాష్ట్రలో బైక్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్.. ఆగస్టు 1 నుంచి కొత్త పాలసీ: రోజుకు రూ.5 చెల్లిస్తే చాలు

మహారాష్ట్ర ప్రభుత్వం బైక్ ట్యాక్సీల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు చట్టవిరుద్ధంగా నడుస్తున్న లక్షలాది బైక్ ట్యాక్సీలను నియంత్రణలోకి తీసుకురావడానికి కొత్త విధానాన్ని ప్రకటించింది. ఆగస్టు 1, 2026 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త బైక్ ట్యాక్సీ పాలసీ అమల్లోకి తెస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్ణాయక్ వెల్లడించారు. జూలై నెలాఖరులోగా రవాణా శాఖ నుంచి ఈ విధానానికి తుది ఆమోదం లభించే అవకాశం ఉందన్నారు.
4 లక్షల 50వేల బైక్ ట్యాక్సీలకు చట్టబద్ధత..
ప్రస్తుతం మహారాష్ట్రలో సుమారు 4 లక్షల నుంచి 4 లక్షల 50వేల వరకు బైక్ ట్యాక్సీలు అనుమతులు లేకుండా నడుస్తున్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. కొత్త పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత వీటిని అధికారికంగా నమోదు చేసి నియంత్రణలోకి తీసుకురానున్నారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో పాటు బైక్ ట్యాక్సీ రంగంలో పనిచేస్తున్న వారికి చట్టబద్ధమైన గుర్తింపు లభించనుంది.
మహారాష్ట్ర వాసులకే అనుమతులు..
కొత్త విధానంలో అత్యంత కీలకమైన రూల్ ఏంటంటే.. మహారాష్ట్రకు చెందిన వారికే బైక్ ట్యాక్సీ పర్మిట్లు ఇవ్వడం. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా డ్రైవర్లు మరాఠీ భాషను అర్థం చేసుకుని మాట్లాడగలగాలి. దీంతో స్థానిక ప్రయాణికులతో సులభంగా కమ్యూనికేట్ చేయడం సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు.
లైసెన్స్, బ్యాడ్జ్ తప్పనిసరి..
బైక్ ట్యాక్సీ నడపాలనుకునే ప్రతి వ్యక్తికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. మోటార్ వెహికల్స్ చట్టం-1988 ప్రకారం లైసెన్స్‌తో పాటు మహారాష్ట్ర మోటార్ వెహికల్స్ రూల్స్-1989 ప్రకారం పబ్లిక్ సర్వీస్ వెహికల్ బ్యాడ్జ్ కూడా ఉండాలి. ఈ రూల్స్ పాటించిన వారికి మాత్రమే పర్మిట్ జారీ చేస్తారు.
రోజుకు రూ.5.. ప్రతి రైడ్‌పై 2 శాతం
కొత్త పాలసీ ప్రకారం ప్రతి బైక్ ట్యాక్సీ ఆపరేటర్ ప్రభుత్వానికి రోజుకు రూ.5 చెల్లించాలి. అలాగే ప్రతి రైడ్‌పై వచ్చే మొత్తంలో 2 శాతం ప్రత్యేక సంక్షేమ నిధికి జమ చేయాలి. ఈ నిధిని బైక్ ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమ పథకాల కోసం వినియోగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, సోషల్ సెక్యూరిటీ, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు ఈ నిధిని ఉపయోగించే అవకాశం ఉంది.
ఉబెర్, ఓలా, రాపిడోకు కొత్త అవకాశం..
కొద్ది నెలల క్రితం నిబంధనలు పాటించలేదనే కారణంతో ఉబెర్, రాపిడో, ఓలా వంటి యాప్ ఆధారిత బైక్ ట్యాక్సీ సంస్థల తాత్కాలిక అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు కొత్త పాలసీ అమల్లోకి రావడంతో ఈ సంస్థలు మారుతున్న రూల్స్ కి అనుగుణంగా కార్యకలాపాలు కొనసాగించే అవకాశం ఉంది.
స్థానిక ఉపాధి.. ప్రభుత్వానికి ఆదాయం
ముంబైతో పాటు ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో అనధికారిక బైక్ ట్యాక్సీల వల్ల ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రూపొందించిన కొత్త పాలసీ ద్వారా అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట పడటంతో పాటు స్థానిక యువతకు ఉపాధి, ప్రభుత్వానికి అదనపు ఆదాయం, ప్రయాణికులకు సేఫ్ జర్నీ సేవలు అందుతాయని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.