
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని అభివృద్ధి, దూరదృష్టిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనలో అమరావతిని రోల్ మోడల్‌గా చూపిస్తూ.. పారిశ్రామిక హబ్ అయిన కోయంబత్తూరు అభివృద్ధిపై తనదైన విశ్లేషణ చేశారు. చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో అమరావతి ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. రాజధాని నగరాన్ని పరిపాలనా కేంద్రంగానే కాకుండా, ప్రపంచ స్థాయి ఆర్థిక హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.
ఇందులో భాగంగానే 5000 ఎకరాల విస్తీర్ణంలో భారీ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి పునాది వేశామని గుర్తుచేశారు. “హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఇప్పటికే 2500 ఎకరాల్లో పెద్ద ఎయిర్‌పోర్టులు ఉన్నా, ప్రస్తుత రద్దీ దృష్ట్యా ఆ నగరాలు రెండో ఎయిర్‌పోర్ట్ గురించి ఆలోచిస్తున్నాయి. కానీ మనం 30 ఏళ్ల తర్వాత పెరగబోయే విమాన ప్రయాణీకుల రద్దీని ఇప్పుడే అంచనా వేసి అడుగులు వేయాలి” అని ఆయన పిలుపునిచ్చారు.
Also Read:Stock Market: స్టాక్ మార్కెట్‌లో రక్త కన్నీరు.. ఒక్క రోజులో రూ.71 వేల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి!
తమిళనాడులోని ప్రముఖ పారిశ్రామిక నగరం కోయంబత్తూరులో విమానాశ్రయ విస్తరణ తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. కేవలం 500 ఎకరాల్లో ఎయిర్‌పోర్ట్ ఉంటే సరిపోతుందని భావించడం పాలకుల దూరదృష్టి లోపానికి నిదర్శనమని విమర్శించారు. దక్షిణ భారతదేశంలో మాంచెస్టర్‌గా పేరుగాంచిన కోయంబత్తూరు అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలంటే మెగా ఎయిర్‌పోర్ట్ అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
భూసేకరణ విషయంలో వెనకడుగు వేయడం వల్ల రాష్ట్ర భవిష్యత్తు కుంచించుకుపోతుందని, చిన్న విమానాశ్రయాలతో సర్దుకుపోవడం వల్ల భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండదని హెచ్చరించారు. అమరావతిలో రైతులు స్వచ్ఛందంగా 34,000 ఎకరాలు ఇచ్చి అభివృద్ధిలో భాగస్వాములైన తీరును ఆయన ఉదహరించారు. సరైన నాయకత్వం ఉంటేనే కోయంబత్తూరు వంటి నగరాలు ప్రపంచ పటంలో నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.