Reading Time: 2 minutes
No Rain No Gain Why Monsoon Matters To Stock Markets Know Complete Details Here

మన దేశంలో వర్షాకాలం (మాన్‌సూన్) అనేది వాతావరణానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, అది మన ఆర్థిక వ్యవస్థకు ఒక దిక్సూచి లాంటిది. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే వడ్డీ రేట్ల ప్రకటనలను మార్కెట్లు ఎంత నిశితంగా గమనిస్తాయో.. వానల కోసం కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తాయి.

పల్లెల్లో పైసా ఆడితేనే.. పట్టణాల్లో పండగ
మన దేశంలో సాగువుతున్న భూమిలో దాదాపు రెండు వంతుల భూమి వానాకాలంపైనే ఆధారపడి ఉంది. సరైన సమయంలో వానలు పడితేనే రైతు చేతికి పంట వస్తుంది. రైతు దగ్గర డబ్బులు ఉంటేనే అవి ఖర్చు రూపంలో మార్కెట్లోకి వస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల దగ్గర నగదు పెరిగితే వారు బైకులు, ట్రాక్టర్లు కొనడం లేదా బంగారంపై రుణాలు తీసుకోవడం వంటివి చేస్తారు. అంటే, వానలు బాగా పడితే పల్లెల్లో ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, అప్పులు తీర్చే శక్తి కూడా పెరుగుతుంది.

ధరల నియంత్రణలో వానల పాత్ర
వానలు సరిగ్గా పడితే పంటలు బాగా పండుతాయి, దీనివల్ల కూరగాయలు, పప్పు ధాన్యాల ధరలు అదుపులో ఉంటాయి. మన దేశంలో సగటు మనిషి బడ్జెట్‌లో ఆహార పదార్థాలదే ప్రధాన వాటా. ధరలు తక్కువగా ఉంటే ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) అదుపులో ఉంటుంది. అప్పుడు రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంటుంది. ఇది వ్యాపారాలకు, షేర్ మార్కెట్లకు సానుకూల అంశం.

Also Read:Early Retirement Plan: 45 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకోవాలా? ఈ 5 ఆర్థిక సూత్రాలు పాటిస్తే మీరు ధనవంతులే..

ఏయే రంగాలపై ప్రభావం ఉంటుంది?
వానలు బాగుంటే ముఖ్యంగా ట్రాక్టర్లు, టూ-వీలర్లు, ఎరువులు, విత్తనాలు మరియు నిత్యవసర వస్తువుల కంపెనీలకు (FMCG) మంచి గిరాకీ ఉంటుంది. అయితే.. కేవలం వానలు పడటమే కాదు, అవి దేశమంతా సమానంగా, సరైన సమయంలో కురవడం చాలా ముఖ్యం. వానలు ఆలస్యమైనా లేదా ఒకేచోట ఎక్కువ పడినా లాభం కంటే నష్టమే ఎక్కువ.

పెట్టుబడిదారులు ఎందుకు భయపడతారు..?
ఈ ఏడాది ముడి చమురు ధరలు పెరగడం, అంతర్జాతీయ యుద్ధ వాతావరణం వంటి కారణాల వల్ల మార్కెట్లు కొంత ఆందోళనలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో వానలు కూడా తక్కువ పడితే ఆహార పదార్థాల ధరలు పెరిగి, సామాన్యుడి బడ్జెట్ తలకిందులవుతుంది. అందుకే ఇన్వెస్టర్లు కేవలం వానలు పడ్డాయా లేదా అని చూడరు.. అవి ఎక్కడ పడ్డాయి? విత్తనాలు వేసే సమయానికి పడ్డాయా? చెరువుల్లో నీళ్లు ఉన్నాయా? అనే విషయాలను వారం వారం గమనిస్తూ ఉంటారు. మొత్తానికి చెప్పాలంటే.. వానలు పడితేనే మన కడుపు నిండటమే కాదు.. దేశ ఆర్థిక చక్రం కూడా వేగంగా తిరుగుతుంది.