Reading Time: 2 minutes
Harish Rao Slams Tejasvi Surya Telangana Remarks

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సాక్షిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించిన తేజస్వి సూర్య వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దశాబ్దాల పోరాటం, వేలాది మంది విద్యార్థులు, యువత త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణను ఒక విద్వేషపూరిత విభజనతో పోల్చడం అమరుల త్యాగాలను అవమానించడమేనని హరీష్ రావు ధ్వజమెత్తారు.

PM Modi: ఇది చరిత్ర సృష్టించే సమయం.. మహిళా రిజర్వేషన్లకు ప్రధాని మద్దతు..

తెలంగాణ ఆవిర్భావం రాజ్యాంగబద్ధంగా జరిగిందని, నేడు ఈ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలవడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోందని హరీష్ రావు విమర్శించారు. “ఇండియా-పాకిస్థాన్ విభజన లాంటిదే తెలంగాణ ఏర్పాటు అయితే, ఆనాడు బీజేపీ పార్లమెంట్‌లో విభజన బిల్లుకు ఎందుకు మద్దతు తెలిపింది?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రధాని మోడీ గతంలో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై విషం చిమ్మారని, నేడు తేజస్వి సూర్య అదే బాటలో నడుస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం స్పందించి తన వైఖరిని స్పష్టం చేయాలని, లేదంటే ఇది ఆ పార్టీ అధికారిక ధోరణిగానే భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Delimitation Bill: మీ టికెట్లు అన్నీ ముస్లిం మహిళలకు ఇవ్వండి.. అఖిలేష్‌కు అమిత్ షా కౌంటర్..

రాష్ట్రం నుంచి గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, అలాగే కాంగ్రెస్ ఎంపీలు తేజస్వి సూర్య అనుచిత వ్యాఖ్యలను ఖండించకుండా మౌనంగా ఉండటం సిగ్గుచేటని హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ పేరుతో ఓట్లు అడిగి గెలిచిన వీరు, ఢిల్లీ పెద్దల ముందు వంగి రాష్ట్ర గౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. “బీఆర్ఎస్ ఎంపీలే లోక్‌సభలో ఉండి ఉంటే తేజస్వి సూర్య సంగతి తేల్చేవారు” అని పేర్కొన్న ఆయన, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్న ఎంపీలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ అంటే ఒక పోరాట గాథ అని, స్వాభిమానానికి ప్రతీక అని హరీష్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర హక్కులు, ఆత్మగౌరవంపై దాడి చేసే శక్తులను తెలంగాణ ప్రజలు ఎన్నడూ క్షమించరని హెచ్చరించారు. తెలంగాణను అవమానించే ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టి సమాధానం ఇస్తామని, త్యాగాల చరిత్రను అగౌరవపరిస్తే సహించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.