Reading Time: < 1 minute
Pawan Kalyan Divorce Comments Standup Comedian Anudeep Katikala Controversy

ఏదో సాయంత్రాన సరదాగా నవ్వుకోవడానికి వెళ్లే స్టాండప్ కామెడీ షోలు ఈ మధ్యకాలంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికల చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఒక ప్రైవేట్ స్టాండప్ కామెడీ షోలో అనుదీప్ కటికల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజాలపై సెటైర్లు వేశారు. అయితే, అవి కేవలం నవ్వుకునేలా కాకుండా, వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను కించపరిచేలా ఉన్నాయనేది ప్రధాన ఆరోపణ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, ఆయన విడాకుల అంశాన్ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి.

పవన్‌తో పాటు నిహారిక కొణిదెల, రామ్ చరణ్, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్లపై కూడా అనుదీప్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఫ్యాన్ మాత్రమే కాకుండా సామాన్య జనం కూడా ఈ ధోరణిని తప్పుబడుతున్నారు. ఈ వీడియోలపై పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. ఇక అనుదీప్ కటికల తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నెటిజన్లు ఆయన పాత వీడియోలను కూడా బయటకు తీస్తూ ట్రోలింగ్ మొదలుపెట్టారు.