Reading Time: < 1 minute
Indian Players Struggling In Ipl 2026 Bumrah Arshdeep Samson Among Stars Out Of Form

Indian Players Struggle in IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో పలువురు యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. వైభవ్ సూర్యవంశీ, ముకుల్ చౌదరి, అశోక్ శర్మ, ఆయుష్ మాత్రేలు అదరగొడుతూన్నారు. మరోవైపు భారత జట్టుకు కీలకమైన కొందరు స్టార్ ప్లేయర్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. మ్యాచ్‌ను మలుపుతిప్పే సామర్థ్యం ఉన్న ఈ స్టార్ ఆటగాళ్లు.. ఐపీఎల్ 2026లో మాత్రం ఫామ్ కోసం తంటాలు పడడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ముంబై ఇండియన్స్‌ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు చెప్పగోదగ్గ ప్రదర్శన చేయలేదు. మూడు మ్యాచ్‌లలో ఒక్క వికెట్ తీయకపోవడం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. డెత్ ఓవర్లలో ప్రత్యర్థులను కట్టడి చేసే బుమ్రా ఈసారి తేలిపోతున్నాడు. పంజాబ్ కింగ్స్‌కు ఆడుతున్న అర్ష్‌దీప్ సింగ్ కూడా వికెట్ కోసం తంటాలు పడుతున్నాడు. అంతేకాదు భారీగా పరుగులు ఇస్తున్నాడు. వైడ్ల రూపంలో కూడా రన్స్ సమర్పించుకుంటున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2026లో రెచ్చిపోయిన అర్ష్‌దీప్, బుమ్రాలు ఇప్పుడు ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్నారు.

కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా ఈ సీజన్‌లో ప్రభావం చూపలేకపోయాడు. మిస్టరీ స్పిన్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే వరుణ్.. ఇప్పటి వరకు వికెట్ ఖాతా తెరవలేకపోవడం గమనార్హం. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా తన ప్రభావం చూపలేకపోయాడు. బ్యాటింగ్‌లో ఇప్పటి వరకు ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేయలేదు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న సంజు శాంసన్ కూడా ఈ సీజన్‌లో ఫామ్‌ను అందుకోలేకపోతున్నాడు. ప్రతిభావంతమైన బ్యాట్స్‌మెన్ అయినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క అర్ధ శతకం కూడా చేయలేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఐపీఎల్ 2026లో యువ ఆటగాళ్లు మెరుస్తుంటే.. అనుభవజ్ఞులైన భారత స్టార్ ప్లేయర్లు మాత్రం ఫామ్ కోసం పోరాడుతున్నారు. ఈ స్టార్ ఆటగాళ్లు త్వరలోనే తిరిగి తమ పాత ఫామ్‌ను అందుకుని జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.